Excise Dept On Pubs: తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది. ఇటీవల బంజారాహిల్స్‌లోని పబ్‌లో మాదకద్రవ్యాల విక్రయాలు జరిగినట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ కట్టడిపై ఆబ్కారీ శాఖ దృష్టి సారించింది. ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇటీవల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మాదకద్రవ్యాల విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్‌లు, క్లబ్‌ల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీకెమెరాల పనితీరును ఎక్సైజ్ శాఖ పరీశీలిస్తోంది. ఈ సీసీ కెమెరాలను ఆబ్కారీ శాఖ స్టేషన్లకు అనుసంధానం చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. లైసెన్స్ పొంది లిక్కర్ విక్రయాలు చేస్తున్న అన్ని చోట్ల నిర్దేశించినట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా లేదా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
అదే విధంగా ఎన్ని రోజులకు చెందిన డేటాను నిల్వ చేసుకునే సామర్థ్యం, రాత్రి వేళల్లో క్లియర్‌గా రికార్డు చేస్తున్నాయా అన్నది నిర్ధారించనున్నారు. ఎక్కడైనా సీసీ కెమెరాలు పని చేయకపోతే తక్షణమే మరమ్మతులు చేయాలని ఆబ్కారీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు ఎక్సైజ్ స్టేషన్లకు అనుసంధానం చేసేందుకు ఎంత ఖర్చవుతుందని తదితర అంశాలపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Lokesh: 'జగన్ పరిపాలనలో న్యాయస్థానాలకు సైతం రక్షణ లేదు'