అమరావతి రైతులు తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ చేపట్టిన పాదయాత్రలో భాగంగా రైతులు ఈనెల 15న తిరుమల చేరుకుంటారు. వేంకటేశ్వరస్వామి దర్శనం తర్వాత ఈనెల 17న తిరుపతిలో బహిరంగసభ నిర్వహించాలని భావించారు. కాగా.. ఎస్వీ యూనివర్శిటీ మైదానంలో సభకు అధికారులు అనుమతివ్వలేదు. దీంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు స్థలంలో సభకు అనుమతివ్వాలని తిరుపతి పోలీసులను కోరారు.
సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఇవాళ సాయంత్రం తిరుపతి అర్బన్ పోలీసులు లేఖ పంపారు. రైతుల పాదయాత్రకు మాత్రమే హైకోర్టు అనుమతిచ్చిందని పోలీసులు తమ లేఖలో పేర్కొన్నారు. రైతుల పాదయాత్రలో 42 రకాల ఉల్లంఘనలు జరిగాయన్నారు. పాదయాత్రపై చిత్తూరు జిల్లాకు చెందిన కొన్ని సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయాన్ని పోలీసులు ప్రస్తావించారు. రాజకీయపరమైన విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకుంటే గొడవలకు ఆస్కారం ఉందని.. అందుకే అనుమతివ్వటం లేదని స్పష్టం చేశారు.
బహిరంగ సభ అనుమతి కోసం అమరావతి ఐకాస నేతలు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే హక్కు రైతులకు ఉందని...హైకోర్టు ద్వారా సభకు అనుమతి సాధిస్తామని న్యాయవాది లక్ష్మినారాయణ తెలిపారు.
ఇదీ చదవండి
AMARAVATHI FARMERS: శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న అమరావతి రైతులు