దిగ్గజ సంస్థల సర్వర్ల నుంచి ప్రజల వివరాలు సేకరించి, నిధులు అపహరిస్తున్న సైబర్ నేరగాళ్లు కొందరైతే.. మొబైల్ యాప్‌ల ద్వారా వినియోగదారులకు మేలు చేస్తున్నట్లే కనిపిస్తూ, వివరాలను సంగ్రహిస్తున్న మాయగాళ్లు ఇంకొందరు. వీటితో బ్యాంకు ఖాతాల్లో సొమ్మును కొల్లగొట్టేవారు కొందరైతే.. మరికొందరు ఈ సమాచారం మొత్తాన్ని తెగనమ్ముకుంటున్నారు. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో డిజిటల్ లావాదేవీలు అమాంతం పెరిగాయి. అదే స్థాయిలో సైబర్ నేరాలూ పెచ్చరిల్లాయి. దిల్లీలో దాదాపు 30 వేల కేసులు నమోదైతే, పుణెలో 14,760, గాజియాబాద్‌లో 1,755 కేసులు వచ్చాయి. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఇలాంటి నేరాలు 2,500కు పైగా వెలుగుచూశాయి.
‘యాప్’ తో పాటే మాల్‌వేర్
వినోదం, ప్రయాణాలు, ఇ-కామర్స్, ఫిన్‌టెక్, హెల్త్, స్టాక్‌మార్కెట్, క్రిప్టో.. రంగాలకు సంబంధించి పలు రకాల యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. డౌన్‌లోడ్ చేసుకునే వారి వ్యక్తిగత సమాచారాన్ని ఇవి సేకరిస్తాయి. కేవలం సమాచారాన్ని సంగ్రహించేందుకే కొన్ని యాప్‌లు రూపొందుతున్నాయి. అశ్లీల చిత్రాలు, డేటింగ్ యాప్‌లు ఇలాంటివే. వీటితో పాటు ప్రమాదకర ‘మాల్‌వేర్’ ఫోన్‌లో చేరుతోంది. తద్వారా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లో ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్‌ను నియంత్రించే దాకా వెళ్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
* యాప్‌ను ఎవరు అభివృద్ధి చేశారు, ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారో గమనించాలి. ‘యూజర్ కామెంట్స్’ పరిశీలిస్తే మంచీ చెడూ తెలుస్తాయి. లక్షలు, కోట్లలో డౌన్‌లోడ్‌లు కనిపిస్తే, దాన్ని కొంత నమ్మొచ్చు. వెయ్యి, రెండు వేల డౌన్‌లోడ్స్ మాత్రమే ఉంటే, అనుమానించాల్సిందే. అనధికారిక యాప్‌లకు ఏపీకే అని కనిపిస్తుంది. దాన్ని గుర్తించాలి.
* యాప్‌లను వాటి ఒరిజినల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం మేలు.
* ‘ఇన్‌స్టాల్’ చేసే సమయంలో యాప్‌లన్నీ వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతాయి. అవసరం లేకపోయినా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అనుమానం వస్తే, ఇన్‌స్టలేషన్ ఆపాలి.
* కొన్ని యాప్‌లు సమాచారమిస్తే కానీ ఇన్‌స్టాల్ కావు. ఆ సమాచారం ఇచ్చేసి, యాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘పర్మిషన్స్’ ను డిజేబుల్ చేయాలి. అప్‌డేట్స్ వచ్చినపుడూ, మళ్లీ ‘పర్మిషన్స్’ ఆన్ అవుతాయి. దాన్ని గుర్తించి డిజేబుల్ చేయాలి.
* మొబైల్ ఫోన్లో మంచి యాంటీ- వైరస్ సాఫ్ట్‌వేర్ వేసుకుంటే, కొంత భద్రత లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సైబర్ స్వచ్ఛ కేంద్ర అనే వెబ్‌సైట్ నుంచి కొన్ని యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇవి ఇస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త
లొకేషన్: యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోగానే అది మన లొకేషన్ అడుగుతుంది. ఇచ్చామా.. మనమీద నిఘా ప్రారంభమైనట్లే. మన కదలికలు ఎప్పటికప్పుడు వెల్లడవుతున్నట్లే. వాటి ఆధారంగా మన అవసరాలు, ఇష్టాలు పసిగట్టి సంబంధిత వస్తు-సేవలు అందించే వ్యాపార సంస్థలు తెగ ఫోన్లు చేస్తాయి.
ఈ-కేవైసీ: ఇది చాలా ప్రమాదం. ఈ సమాచారం బయటకు వెళ్లిపోతే మన ఆర్థిక మూలాలపై నేరగాళ్లు దాడిచేసే అవకాశం ఉంటుంది. తొందరపడి ఆధార్, పాన్.. తదితర వివరాలు ఇవ్వొద్దు.
బ్యాంకు ఖాతా: డిజిటల్ చెల్లింపుల యాప్‌లు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేస్తున్నాయి. నమ్మకమైన ఒక యాప్‌తో జాగ్రత్తగా లావాదేవీలు నిర్వహించడం మేలు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు: స్టాక్‌మార్కెట్‌లో షేర్ల క్రయవిక్రయాలకు, ఖాతా ఉన్న స్టాక్ బ్రోకింగ్ సంస్థ యాప్ అయితే ఇబ్బంది లేదు. ‘థర్డ్ పార్టీ’ యాప్‌ల ద్వారా లావాదేవీలు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
హెల్త్ యాప్‌లు: ‘టెలి మెడిసిన్’ విస్తరణ వల్ల హెల్త్ యాప్‌ల ఆవిష్కరణకు వీలు కలిగింది. ఇవి మన ఆరోగ్య రహస్యాలన్నింటినీ తమ ‘డేటాబేస్’లో నిక్షిప్తం చేస్తాయి. ఈ సమాచారాన్ని బీమా కంపెనీలు, కొన్ని వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, సేకరించి తమ ఉత్పత్తులు.. సేవలను విక్రయించడానికి వినియోగించుకుంటున్నాయి.
ఇదీ చూడండి: TIRUPATHI AIRPORT: ప్రైవేటుకు తిరుపతి ఎయిర్‌పోర్టు..తర్వాత విజయవాడ, రాజమహేంద్రవరం