కొవిడ్-19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలించాలని సీఎం జగన్ ఆదేశించారు. సమీక్షలో అధికారుల సలహాలు, సూచనల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలించారు. ఇది జూన్ 20 తర్వాత అమలులోకి వస్తుంది.
తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి 2 గంటల వరకే సడలింపు ఉంటుంది. కొవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందునా... ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే సడలింపు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ ఇచ్చారు. తాజా సడలింపులు జూన్ ౩౦ వరకు అమలవుతాయి. కొత్తగా నిర్మించాలనుకున్న 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనివల్ల మెడికల్ ఆక్సిజన్ విషయంలో రాష్ట్రానికి స్వయం సమృద్ధి వస్తుందని అభిప్రాయపడ్డారు.
కొవిడ్ నియంత్రణ చర్యలను ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. మరణాల రేటును నియంత్రించడంలో, అతి తక్కువ మరణాల రేటు నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచిందన్నారు. పాజటివిటీ రేటు 5.99శాతం, రికవరీ రేటు 95.53 శాతానికి చేరిందన్నారు. యాక్టివ్ కేసులు 70వేల దిగువకు నమోదైనట్టు వివరించారు. ప్రస్తుతం 67,629 కేసులు ఉన్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో అతి తక్కువగా పాజిటివిటీ రేటు 2.58శాతం నమోదుకాగా తూర్పుగోదావరి జిల్లాలో 12.25 శాతం నమోదైందని తెలిపారు.
ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్ జనరేషన్ యూనిటే కాకుండా క్రయోజనిక్ ట్యాంకర్లను పెట్టాలి ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సరఫరాకు భరోసా ఉంటుందన్నారు. వీటితోపాటు డి-టైప్ సిలెండర్లు కూడా ఉంచడంవల్ల మూడు ఆక్సిజన్ నిల్వలు, రోగులకు ఆక్సిజన్ అందించడంలో సమర్థవంతమైన ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి 100 బెడ్లు, ఆపై పడకలున్న ఆస్పత్రులవద్ద 10 కిలోలీటర్ల ఆక్సిజన్ ట్యాంకులను స్టోరేజీకింద పెడుతున్నామని అధికారులు తెలిపారు.
కొత్తగా నిర్మించాలనుకున్న 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. దీనివల్ల మెడికల్ ఆక్సిజన్ విషయంలో స్వయం సమృద్ధి రాష్ట్రానికి వస్తుందన్నారు. వైద్యానికి పెద్దగా అవసరాలు లేని సమయంలో ఆ ప్లాంట్ నుంచి వచ్చే ఆక్సిజన్‌ను పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు.
ఇదీ చదవండీ... AP Jobs: జాబ్ క్యాలెండర్ విడుదల.. ఇకనుంచి ఇంటర్వ్యూలు లేవ్!