ఫ్యూచర్ బయోథెరపెటిక్స్ కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి కోసం బయోటెక్ కంపెనీలతో సీఎస్ఐఆర్-ఐఐసీటీ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఐఐసీటీలో భారత్ బయోటెక్, బయోవెట్, సాపిజెన్ బయాలాజిక్స్ కంపెనీలతో కుదురిన ఈ మాస్టర్ కొలాబరేటివ్ అగ్రిమెంట్ ఎంతో కీలకమైందని సీఎస్ఐఆర్ డీజీ డాక్టర్ శేఖర్ మాండే అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జరిగిన ఈ ఎంవోయూ వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు అవసరమైన అడ్జువెంట్స్, రసాయన కారకాల వేగవంత పంపిణీకి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్ తయారీని ప్రస్తావిస్తూ.. దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్ బయోటెక్ సామర్థ్యం ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేసిందని డీజీ కొనియాడారు.
ఈ ఒప్పందం.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అనేక వ్యాధులను నయం చేసేందుకు, భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. కొవాక్జిన్ తయారీలో ఐఐసీటీ సహకారం ఎనలేనిదని.. వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు అవసరమైన రసాయన కారకాలు, ముడి పదార్థాల కొరత వేధిస్తోందని తెలిపారు. కంపెనీలు, ప్రభుత్వ సంస్థల మధ్య ఇలాంటి భాగస్వామ్య ఒప్పందాలు ఈ సమస్యను అధిగమించేందుకు దోహదం చేస్తాయని కృష్ణ ఎల్ల అభిప్రాయపడ్డారు.