కూలీలు తదితరులను 14 రోజుల పాటు ఇనిస్టిట్యూషనల్ లేదా పెయిడ్ క్వారంటైన్లో ఉంచిన తదుపరి వారిని ఇళ్ళకు పంపడంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రం నుండి 57వేల మంది వలస కూలీలను బయట రాష్ట్రాలకు పంపించామని మరో 47 వేల మందికి పైగా కూలీలను స్వస్థలాలకు పంపుతామని చెప్పారు. ఎవరు రాష్ట్రంలోనే ఉండాలనుకుంటున్నారు... ఎవరెవరు స్వంత ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారో వివరాలు సేకరించి ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. వలస కూలీలను తరలించే ప్రక్రియను మరికొన్ని రోజులు కొనసాగించాలని అన్నారు.
విదేశాల నుండి 13వేల మందికి పైగా వస్తున్నారని వారిని 14రోజుల పాటు క్వారంటైన్లో ఉంచాలని సీఎస్ చెప్పారు. ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రానికి వస్తున్న వారిని గ్రామాల్లో ఎఎన్ఎం, ఆశా వర్కర్ లు వారిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేలా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీలం సాహ్ని కలెక్టర్లను ఆదేశించారు. వివిధ దుకాణాలు వద్ద పాటించాల్సిన ప్రామాణిక విధానాలను ఖచ్చితంగా పాటించాలని... ఒకేసారి ఐదుగురుకి మించి దుకాణంలోకి అనుమతించకూడదని ఆమె స్పష్టం చేశారు.
గురువారం నుండి పరిమిత సంఖ్యలో అంతర్ జిల్లా బస్సు సర్వీసులు జిల్లా కేంద్రాలకు, ఇతర ముఖ్య ప్రాంతాలకు బస్టాండ్ టు బస్టాండ్ కు నడవనున్నాయని చెప్పారు. పరిస్థితిని చూశాక మరిన్ని సర్వీసులు నడపడం జరుగుతుందని తెలిపారు. బస్సు సామర్థ్యంలో 50శాతం మందితోనే నడపడం జరుగుతుందని చెప్పారు.