PM TOUR: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జులై 4న ప్రధాని నరేంద్రమోదీ పర్యటన పురస్కరించుకుని వివిధ శాఖలు తగిన ఏర్పాట్లలో నిమగ్నం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదేశించారు. సచివాలయం నుంచి సంబంధిత శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్షించారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. ఈమేరకు అన్ని శాఖల అధికారులు తగిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. పట్టణంలోని రోడ్లను పూర్తిగా మరమ్మతు చేయాలని.. అలాగే బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు శాఖ దృష్టి సారించాలి’ అని ఆదేశించారు. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణబాబు, శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సమాచారశాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి వీడియో లింక్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
కడప-బెంగళూరు రైల్వే లైనుపై సమీక్ష
కడప-బెంగళూరు రైల్వే లైను భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని కడప, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను సీఎస్ సమీర్‌శర్మ ఆదేశించారు. ప్రతినెలా ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ప్రగతి అంశాల్లో భాగంగా ఉన్న ఈ ప్రాజెక్టుపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రైల్వే జీఎంతో వారం రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
ఇవీ చదవండి: