ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో జలజీవన్ మిషన్ కార్యక్రమాల అమలుకు తగిన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. ఆ ప్రణాళికలను కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు వివరించారు. భూగర్భజలాల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. భూగర్భ జలశాఖ స్వర్ణోత్సవాల సందర్భంగా మార్చి 16 నుంచి 22 వరకు రాష్ట్రంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జలజీవన్ మిషన్‌పై కేంద్ర కేబినెట్ కార్యదర్శి దిల్లీ నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించగా సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని మాట్లాడారు. మార్చి 22న ప్రధాని నిర్వహించే వీడియో కాన్ఫరెన్సులో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజలు, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు ఆదిత్యనాథ్ దాస్ వివరించారు.
రాష్ట్రంలో ఇప్పటికే జలజీవన్ మిషన్ ప్రణాళికలకు అనుగుణంగా రూట్ మ్యాప్ రూపొందించినట్లు చెప్పారు. భూగర్భజలాల సద్వినియోగంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో 32 లక్షల మంది యువతను జలజీవన్ మిషన్‌లో భాగస్వాములను చేస్తున్నట్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా చెప్పారు. మార్చి 22న దేశవ్యాప్తంగా జలశపథం నిర్వహిస్తున్నామని, ప్రధాని దేశవ్యాప్తంగా నిర్వహించే గ్రామసభలను ఉద్దేశించి మాట్లాడతారని అన్నారు. భూ ఆక్రమణలపై సీఎస్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, కె.ప్రవీణ్‌కుమార్, జె.శ్యామలరావు, గిరిజా శంకర్, పి.వి. చలపతిరావు, వి. చంద్రయ్య, ఎం. శివప్రసాద్, పి. సంపత్ కుమార్, బి. హరిరామ్ తదితరులు పాల్గొన్నారు.