మెదడును మానవ శరీరం మొత్తానికి యజమానిగా చెప్పవచ్చు. దీనినుంచి ప్రధాన కేబుల్ మాదిరిగా వెన్నెముక అక్కడి నుంచి తీగల్లా వివిధ నరాలు శరీర భాగాలకు చేరుతూ ఒక వ్యవస్థగా ఉంటాయి. మెదడు ఆదేశాలతో అన్ని అవయవాలు, కండరాల కదలిలకను నియంత్రించేది ఆ నరాల కనెక్షన్లే. ఏ పని చేయాలన్నా నరాల వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండాలి. అలా విస్తరించి ఉన్న నరాల్లో కాళ్లు, చేతుల్లో ఉండే కొన్నింటిని ఫెరిఫెరల్ నరాలు అంటారు.
అడుగుతీసి అడుగు వేయాలన్నా, వస్తువులను పట్టుకోవాలన్నా, వస్తువు వేడిగా ఉందా? చల్లగా ఉందా?తెలియాలన్నా ఈ ఫెరిఫెరల్ నరాల పనితీరు బాగుండాలి. తమకు నిర్దేశించిన పనిని చక్కగా ఈ నరాలు చేస్తుండాలి. ఈ వ్యవస్థలో ఏ చిన్న అవాంతరం తలెత్తినా స్పర్శ తగ్గటం, తిమ్మిర్లు పట్టటం, చురుక్కుమనే లక్షణాలు కనిపిస్తాయి. ఫెరిఫెరల్ నరాలు దెబ్బతినటం వల్ల కనిపించే ఈ లక్షణాలనే ఫెరిఫెరల్ న్యూరోపతి అంటారు. షుగర్ బాధితుల్లో ఈ న్యూరోపతి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
అన్నం కలపటమూ కష్టమవుతుంది.!
ఫెరిఫెరల్ నరాలను మూడు రకాలుగా పేర్కొంటారు. వీటిల్లో సెన్సార్ నరాలు దెబ్బతిన్నప్పుడు స్పర్శ జ్ఞానం తగ్గుతుంది. వేడి, చల్లటి వస్తువుల మధ్య తేడాను గుర్తించలేరు. నడుస్తున్నప్పుడు కాళ్లకు దెబ్బ తగిలినా తెలియదు. కాళ్లు మొద్దుబారిపోతుంటాయి. రాత్రివేళ కాళ్లలో మంటలు పుడతాయి. వేడి నీళ్లు పట్టుకుంటే చేతులకు బొబ్బలు వస్తాయి కానీ.. వేడి మాత్రం తెలియదు. దెబ్బ తగిలిందన్న విషయమూ బోధపడదు. ఆ గాయాలూ త్వరగా మానవు. కండరాలకు పటుత్వాన్నిచ్చే నరం తెగినపుడు వస్తువులను పట్టుకోవటమూ చాలా కష్టం అవుతుంది. కండరాలు పూర్తిగా బలహీనపడతాయి. అన్నం కలుపుకోవటం కూడా కష్టంగా మారుతుంది. సొంతంగా పనులు చేసుకోలేరు. అటానమిక్ నరం దెబ్బతిన్నప్పుడు గుండె, శ్వాస వేగాల్లో తేడా వస్తుంది.
ఎవరిలో ఎక్కువగా..
ఫెరిఫెరల్ న్యూరోపతి అనేది సాధారణంగా మధుమేహుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పాటు కాలేయ జబ్బులు, క్యాన్సర్లతో బాధపడుతున్నప్పుడు కూడా న్యూరోపతి కనిపించే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో గాయపడినపుడు కట్టు సరిగా కట్టకపోయిన సందర్భాల్లో కూడా ఫెరిఫెరల్ న్యూరోపతి కనిపించవచ్చు. బీపీ సిండ్రోమ్, కనెక్టివిటీ టిష్యూ డిసిజెస్ కూడా ఈ వ్యాధికి కారణం అవుతాయి. కొన్ని కుటుంబాల్లో ఫెరిఫెరల్ న్యూరోపతి వంశ పారంపర్యంగా కూడా రావొచ్చు. పంట పొలాల్లో ఉపయోగించే పెస్టిసైడ్స్, టీబీ, కాన్సర్ నివారణకు వాడే కొన్ని రకాల మందుల కారణంగా కూడా ఈ వ్యాధి రావొచ్చు. బాధితుల్లో కనిపించే లక్షణాలను బట్టి న్యూరోపతిని చాలా వరకు నిర్ధారణ చేయవచ్చు.
ఇదీ చూడండి :