సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. దిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిందే అన్నారు. జీఎస్టీ, నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ అంటూ అనేక విషయాల్లో ప్రజలను మోసం చేసిన వారిని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. అన్నదాతల ఉద్యమాన్ని చూస్తుంటే.. రెండో స్వాతంత్య్ర పోరాటం జరుగుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అధికారం ఉంది కదా అని.. కేంద్ర ప్రభుత్వం వారికి అనుకూలంగా అనేక ఉత్తర్వులు తెస్తుందని చట్టాలను సైతం మర్చేస్తుందని ఆరోపించారు.
ఆందోళన చేసే వారిలో రైతులు లేరంటూ.. పాకిస్థాన్, చైనా మద్దతుదారులు ఉన్నారంటూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటం చూసి వారు మాట్లాడాలని చాలెంజ్ విసిరారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం రిలయన్స్ సంస్థ 90 వేల కోట్లు సిద్ధం చేసిందని.. ఆదానీ గోడౌన్లు సిద్ధం చేసిందని చెప్పారు. అంతా కలిసి వ్యవసాయ ఉత్పత్తులు దోచుకునేందుకు సిద్ధం అయ్యారని నారాయణ విమర్శించారు.
రైతులు కార్పోరేట్ వ్యవస్థకు బానిసలుగా మరాల్సిన పరిస్థితి వస్తుందని.. చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాల్సిందేనని పునరుద్ఘాటించారు. రాజకీయ లబ్ధికోసమే రవీంద్రనాథ్ ఠాగూర్ వేషధారణతో మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 400 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నారని చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడ జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వచ్చానని నారాయణ అన్నారు.
ఇదీ చదవండి: