రాష్ట్రంలోని 1,658 ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా, 564 ప్రైవేట్ ఆసుపత్రుల్లో రుసుము తీసుకుని కొవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. కొవిన్ యాప్‌లో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న వారికే కాకుండా... పంపిణీ కేంద్రాలకు వెళ్లిన వారికి సైతం అక్కడి పరిస్థితులను అనుసరించి టీకా వేస్తారు. వీరందరికీ టీకా వేసేందుకు వీలుగా ‘కొవిన్ 1.0’ యాప్‌ను ‘కొవిన్ 2.0’గా ఆధునికీకరిస్తున్నారు.
ఈ కారణంగా... శని, ఆదివారాల్లో టీకా పంపిణీ నిలిపివేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు జరిగిన 4 లక్షల మంది ఆరోగ్య సిబ్బందిలో 67% మంది మొదటి డోసు టీకా పొందారు. ఇతర శాఖల ఉద్యోగులు 6 లక్షల మంది ఉంటే వీరిలో 35% మంది వరకు మొదటి డోసు టీకా పొందారు. ఆరోగ్య సిబ్బందిలో 1.40 లక్షల మంది రెండో డోసూ పొందారు. సోమవారం నుంచి కొవిన్ యాప్‌లో టీకా అవసరమైన వారు పేర్లు నమోదు చేసుకొనే అవకాశాన్ని కల్పించబోతున్నారు.
కొవిన్ యాప్‌లో వివరాల నమోదు ఇలా..!
* ఈ యాప్‌లో రాష్ట్రంలోని 2,222 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు ఉంటాయి.
* ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
* యాప్‌లో ఉండే ఆసుపత్రులు, సమయాన్ని అనుసరించి టీకా పొందేందుకు వివరాలు నమోదుచేసుకోవచ్చు.
* పేరు, వయసు, పురుషులు/మహిళలు, పంపిణీ కేంద్రం, సమయాన్ని ఎంచుకోవాలి.
* ఈ వివరాల నమోదు జరిగిన వెంటనే సమయాన్ని (స్లాట్) కేటాయిస్తూ ఫోన్‌కు సంక్షిప్తసమాచారం వస్తుంది.
నేరుగానూ వెళ్లి వ్యాక్సిన్ పొందొచ్చు..
* కొవిన్ యాప్‌లో ముందస్తుగా వివరాలు నమోదు చేయకున్నా...టీకా పొందే సౌలభ్యం ఉంది.
* సంబంధిత కేంద్రంలో ఆ రోజు టీకా వేయించుకునే వారు తక్కువ మంది ఉంటే అవకాశం కల్పిస్తారు.
* దీనికి ముందు వివరాల నమోదు తప్పనిసరి.
* టీకా తీసుకోగానే రెండో డోసు ఎప్పుడు వేయించుకోవాలనే సమాచారం వస్తుంది.
* ప్రాధాన్య క్రమంలో తొలి డోసు పొందిన 29 రోజుల నుంచి 42 రోజుల్లోగా రెండో డోసు వేస్తారు.
* ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న టీకాను పంపిణీ చేస్తారు.
రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే స్లిప్పు
వివరాల నమోదు అనంతరం కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ స్లిప్ లేదా టోకెన్ ఇవ్వాలని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి. యాప్‌లో ‘స్లాట్’ పొందిన సమయాన్ని డౌన్‌లోడు చేసుకొనే అవకాశాన్నీ కల్పిస్తారు. ఫోన్‌కు వచ్చిన సంక్షిప్త సమాచారాన్ని పంపిణీ కేంద్రాల్లో చూపించినా టీకా వేస్తారు.
జనవరి 1, 2022ను పరిగణనలోకి...
* 45 ఏళ్లు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు టీకా పంపిణీ కేంద్రానికి వెళ్లి అక్కడి సిబ్బందికి వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాలి.
* 60 ఏళ్లు దాటిన వారికి వైద్యుల సర్టిఫికేట్ అవసరం లేదు.
* వయసు గుర్తించేందుకు జనవరి 1, 2022ను ప్రామాణికంగా తీసుకుంటారు.
గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరి!
* ఆధార్ కార్డు
* ఫొటోతో కూడిన ఓటరు కార్డు
* డ్రైవింగ్ లైసెన్సు* పాస్‌పోర్టు
* ఫొటోతో ఉన్న పింఛను డాక్యుమెంట్
* ఎన్‌పీఆర్ కార్డు
టీకా వేయించుకోకుంటే అఫిడవిట్
ఆరోగ్య సిబ్బందిలో ఎవరైనా సరే టీకా వేయించుకోకుంటే వారి నుంచి అఫిడవిట్ తీసుకుంటున్నారు. ‘‘టీకా పంపిణీ గురించి ఆసుపత్రుల అధికారులు చెప్పారు. అయినా నేను స్వచ్ఛందంగా నిరాకరిస్తున్నాను. దీనికి అధికారులు ఎటువంటి బాధ్యులు కారు’ అని అంగీకరిస్తున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
దీర్ఘకాలిక వ్యాధులివే
దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో 20 రకాలను కేంద్రం చేర్చింది. 45-59 ఏళ్ల మధ్య వయసు వారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు వైద్యుల నుంచి ధ్రువపత్రం పొందాలి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పేరు, సంతకం, మెడికల్ కౌన్సెల్ రిజిస్ట్రేషన్ నంబరు, సర్టిఫికేట్ జారీ చేసిన ప్రదేశం, తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి.
* రక్తపోటు, చక్కెర వ్యాధి
* గుండె సంబంధిత వ్యాధులు
* మూత్రపిండాలు, కాలెయ సమస్యలు, డయాలసిస్
* బీపీ, షుగర్‌తో పాటు పక్షవాతం
* దీర్ఘకాలికంగా స్టెరాయిడ్ మందులు వాడేవారు
* ఊపిరితిత్తుల సమస్యతో రెండేళ్లు ఆసుపత్రుల్లో చేరిన వారు
* రక్త సంబంధ క్యాన్సర్లు, ఏడాది నుంచి ఇతర క్యాన్సర్‌తో బాధపడేవారు
* కండరాలు పనిచేయని వారు
* యాసిడ్ బాధితులు
* సికెల్‌సెల్, తలసేమియా, బోన్‌మ్యారో సమస్యలు ఉన్న వారికి
* హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్/ఇమ్యూనోడెఫిషిన్స్
ఇదీ చదవండి:
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేంద్ర జలశక్తిశాఖ అధ్యయనం