రాష్ట్రవ్యాప్తంగా కరోనా సమయంలో సేవలు అందించిన నర్సింగ్ మరియు టెక్నికల్ స్టాఫ్ నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమానికి వెళ్తున్న అవుట్ సొర్సింగ్ నర్సింగ్ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వం నర్సింగ్ మరియు టెక్నికల్ స్టాఫ్ ని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. అయితే కొంత కాలంగా తమకు జీతాలు అందటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏపీ అర్బన్ హెల్త్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో చలో సీఎం క్యాంప్ ఆఫీస్ పేరిట ఉద్యమం చేపట్టారు. జీవో నెంబర్ 686 ప్రకారం ఇచ్చే కొత్త నోటిఫికేషన్ లో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని నేరుగా నియమించాలని కోరారు. తమకు వెయిటేజీ మార్కులు ఇచ్చినా కూడా ఇప్పుడున్న జనరేషన్ తో పోటీ పడలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు తమని కొనసాగించి మిగిలిన ఖాళీలకు మాత్రమే కొత్తవారిని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు.
ధ్రువపత్రాలు ఇవ్వాలి...
విజయనగరం జిల్లాకు చెందిన కొవిడ్ వైద్య సేవలు అందించిన సిబ్బంది ధర్నా చేపట్టారు. బకాయి జీతాలు వెంటనే చెల్లించి.. తాము పని చేసిన కాలానికి సర్వీసు ధ్రువపత్రాలు ఇవ్వాలని కోరారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ ఆందోళనలో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయం చేయాలి..
నెల్లూరు కలెక్టర్ కార్యాలయం కొవిడ్ వైద్య సేవలు అందించిన సిబ్బంది ధర్నా నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న సిబ్బందిని తొలగించి కొత్తవారిని నియమించుకునేందుకు 686 జీవో ఇవ్వడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమకు న్యాయం చేయాలని విన్నవించారు.
ఇదీ చదవండీ.. రేణిగుంట ఘటనకు వైకాపానే కారణం: దేవినేని