జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. రాజకీయ పార్టీల అభ్యర్థులు బీ-ఫారం ఇవ్వకపోయినా ముందుగా నామినేషన్లు వేద్దామని భావించి అనుచరగణాలతో నామినేషన్ కేంద్రాలకు వస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా.. ఏమాత్రం ఎడం లేకుండా కార్యకర్తలు, నాయకులు కలిసి వెళ్తున్నారు. ఆ సమయంలో పోలీసులు అక్కడుంటే కేసులు పెడుతున్నారు తప్ప కోడ్‌ను పట్టించుకోవడం లేదు.
అనుమతుల్లేకుండానే బలప్రదర్శనలు..
అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్లేప్పుడు పరిమిత సంఖ్యలోనే కార్యకర్తలు, అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లాలి. ఊరేగింపుగా వెళ్లేందుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. గ్రేటర్ పరిధిలో గురువారం నామినేషన్లు దాఖలు చేసినవారిలో 95శాతం మంది అభ్యర్థులు వందల సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులను వెంటబెట్టుకుని బల ప్రదర్శనలు నిర్వహించారు. ఖైరతాబాద్ సర్కిల్ కార్యాలయంలో గురువారం నామినేషన్ దాఖలు చేసిన ఓ రాజకీయ పార్టీ అభ్యర్థి వందకుపైగా కార్లలో తమ అనుచరులను తీసుకువచ్చారు. మరో పార్టీ రెండు ఓపెన్‌టాప్ జీపుల్లో లౌడ్‌స్పీకర్లతో నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఊరేగింపులు, ర్యాలీలకు పోలీస్ అనుమతి తప్పనిసరంటూ పోలీసులు ఆదేశించినా పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.
భారీగా ట్రాఫిక్‌జాంలు
నామినేషన్ కేంద్రాలకు 100మీటర్ల దూరంలోనే అభ్యర్థులు వాహనాలను నిలపాలి. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి తమ అభ్యర్థిత్వ పత్రాలను రిట్నరింగ్ అధికారులకు సమర్పించాలి. 70శాతం నామినేషన్ కేంద్రాలు ప్రధాన రహదారులపై ఉండడంతో అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, అనుచరులు వారి వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండడంతో భారీగా ట్రాఫిక్‌జాంలు ఏర్పడుతున్నాయి. అంబర్‌పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, ముషీరాబాద్, సరూర్‌నగర్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో అభ్యర్థుల బల ప్రదర్శనల కారణంగా ద్విచక్రవాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.