తెలంగాణ ములుగు జిల్లా వ్యాప్తంగా రోజుకు 500కు మించి పరీక్షలు చేయడం లేదనేది స్పష్టమవుతోంది. కొవిడ్ నిర్ధరణ పరీక్ష చేసుకుని పాజిటివ్ నిర్ధరణ కాని వారికి మాత్రమే వ్యాక్సిన్ వేసే పద్ధతిని కొంత కాలం అవలంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ.. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ పద్ధతికి తెర వేసింది. కొవిడ్ పరీక్షలతో సంబంధం లేకుండానే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. గతంలో జిల్లాలో రోజుకు 2,300 వరకు పరీక్షలు నిర్వహించిన అధికారులు ఏకకాలంలో వాటిని కుదించారు.
- తగ్గని కేసుల సంఖ్య
గత నెల 27 నుంచి ఈ పద్ధతిని అమలులోకి తెచ్చారు. ఏప్రిల్ 26న 2,372 పరీక్షలు నిర్వహిస్తే 160 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27న 1026 పరీక్షలు నిర్వహించగా 110 కేసులు, 28న 822 పరీక్షలకు 107, 29న 542 పరీక్షలకు 66, 30న 493 పరీక్షలు నిర్వహించగా 77 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పరీక్షల సంఖ్య తగ్గినా పాజిటివ్ కేసుల జోరు అలాగే కొనసాగుతోంది.
- మార్చి నుంచి ఇప్పటి వరకు..
జిల్లాలో ఇప్పటి వరకు ర్యాపిడ్ కిట్ల ద్వారా 60 వేలకు పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. మార్చి 1 నుంచి మే 1 వరకు వీటిని నిర్వహించారు. ఇందులో 1891 మందికి పాజిటివ్ నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. గతేదాడి నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో 7286 కేసులు నమోదయ్యాయి. వీరిలో 5851 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1416 యాక్టివ్ కేసులున్నాయి. ఏడాది కాలం నుంచి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 19 మంది మృతిచెందినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
ప్రభుత్వ ఆదేశాల మేరకే కొవిడ్ నిర్ధరణ పరీక్షలను కుదించాం. లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలున్నాయి. దగ్గు, జలుబు ఉండి పరీక్షలు చేయలేకపోయినా వారికి హోం ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలని కూడా ఆదేశాలున్నాయి. - ఎ.అప్పయ్య, డీఎంహెచ్‌వో
ఇదీ చదవండి:
తిరుపతిలో వైకాపాదే విజయం.. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఫ్యాన్ గాలి