కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి రుణ రూపేణా మరింత వెసులుబాటు లభించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ సుమారు రూ.20,160 కోట్ల వరకు అదనపు రుణం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ మొత్తానికి సంబంధించి స్పష్టమైన లెక్కలు తేలాల్సి ఉంది. రాష్ట్రాలు కోరుతున్నట్లే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 5% వరకు రుణాలు పొందేందుకు కేంద్రం వీలు కల్పించింది. ప్రస్తుతం అది 3% ఉంది. పైగా ఇందుకు కేంద్రం కొన్ని షరతులు విధించింది. వాటిని రాష్ట్రాలు నెరవేరిస్తేనే పూర్తిస్థాయి అదనపు రుణం దక్కుతుంది. లేకుంటే ప్రస్తుతం ఉన్న దాని కన్నా మరో 0.5% వరకు ఎలాంటి షరతులు లేకుండా అదనపు రుణం పొందవచ్చు.
ఇప్పటికే వేస్ అండ్ మీన్స్ పరిమితి, ఓవర్ డ్రాఫ్టు సౌకర్యంలో అనేక వెసులుబాట్లు కల్పించిన కేంద్రం.. తాజాగా అదనపు రుణాలు పొందేందుకు వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి సుమారు రూ.10.08 లక్షల కోట్లు. అందులో ప్రస్తుతం 3% వరకు రాష్ట్రం రుణాలు పొందుతోంది. ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రం ఎంత మొత్తం రుణం పొందవచ్చో కేంద్రం నిర్ణయిస్తుంది. కరోనా ప్రబలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తొలి త్రైమాసికంలో ఎఫ్‌ఆర్‌బీఎంతో సంబంధం లేకుండా రూ.10వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరింది.
సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రానికి రూ.30,240 కోట్ల వరకు రుణం పొందే ఆస్కారం ఉంది. తాజా నిర్ణయం వల్ల అది రూ.50,400 కోట్లకు పెరగవచ్చని అంచనా. షరతులు అమలు చేయకపోయినా మరో 0.5% వరకు తక్షణం అదనపు రుణం పొందే ఆస్కారం ఉంది. ఆ మొత్తం రూ.5,040 కోట్ల వరకు ఉండొచ్చని లెక్కిస్తున్నారు. ఒక దేశం ఒకే రేషన్‌కార్డు, డిస్కంల సంస్కరణలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు, ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు అమలుచేస్తే మిగిలిన 1.5% అదనపు రుణం పొందే ఆస్కారం కల్పించారు.
ఇదీ చదవండి: