రాష్ట్రంలో చాలామంది అసలు కరోనా ఉనికి కోల్పోయినట్లు, తమకేం భయం లేదన్నట్టు మాస్క్ అయినా పెట్టుకోకుండా ఇష్టానుసారం తిరుగుతుంటే.. వైరస్ చాపకింద నీరులా అంతటా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, వాటి శాతం వేగంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 585 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబరు 17న 534 కేసులు రాగా, ఆ తర్వాత మళ్లీ ఇంత ఎక్కువగా రావడం ఇదే తొలిసారి. పాజిటీవిటీ రేటు డిసెంబరు 17న 0.84 ఉంటే, బుధవారం అది 1.66గా నమోదవడం ప్రమాద తీవ్రతకు సంకేతం. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న 2020 సెప్టెంబరులో రోజుకు 10 వేలకు మందికి పైగా వ్యాధి బారిన పడిన సందర్భాలున్నాయి. ఓ దశలో పరీక్షించిన ప్రతి వంద మందిలో 17 మందికి పాజిటివ్‌గా తేలింది. డిసెంబరు నుంచి మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతూ.. ఫిబ్రవరిలో రోజుకు 50-60 కేసులకు పడిపోయింది. ఫిబ్రవరి 13న పాజిటీవిటీ రేటు కనిష్ఠంగా 0.16గా నమోదైంది. మళ్లీ వారం రోజులుగా దేశవ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి పెరుగుతుండగా.. అదే ధోరణి రాష్ట్రంలోనూ కన్పిస్తోంది. దేశంలో ఇప్పటికీ అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది నాలుగో స్థానం. ఈ తరుణంలో కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండటమే పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.
మాస్క్‌పై నిర్లక్ష్యమేల?
పది రూపాయల మాస్క్ పెట్టుకోవడమో, కరోనా బారినపడి ఆస్పత్రిపాలై ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకోవడమో తేల్చుకోవాలంటూ.. కొంత నిష్ఠూరంగానైనా వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా మలి దఫా విజృంభణ మరింత ప్రమాదకరమని, రూపు మార్చుకుంటున్న వైరస్‌కు చికిత్స కష్టంగా మారుతోందని దిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తదితరులు హెచ్చరిస్తున్నారు. అందరూ మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం.. ఇవే 90 శాతం వరకు కరోనాకు ముకుతాడు వేసే మార్గాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినా చాలామంది నిర్లక్ష్యం చేసి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యాధి వ్యాప్తికి వాహకులుగా మారుతున్నారు.
పరీక్షలు పెంచాలి!
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ‘టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్’ అత్యంత కీలకమని నిపుణులు మొదటి నుంచీ చెబుతున్నారు. వీలైనంత ఎక్కువ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, పాజిటివ్‌గా తేలిన వారిని వేరుగా ఉంచి చికిత్స అందించడం, వారితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి వారికీ పరీక్షలు చేయడం ద్వారానే సమర్థంగా నియంత్రించవచ్చు. రాష్ట్రంలో ఇటీవల కేసుల సంఖ్య తగ్గడంతో... పరీక్షల సంఖ్యా తగ్గించారు. ఒకప్పుడు రోజుకు 70-80 వేల పరీక్షల వరకు చేసేవారు. ప్రస్తుతం అవి 30-40 వేలకు తగ్గిపోయాయి. మళ్లీ వ్యాధి విజృంభిస్తున్నందున పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.
ఈ తరుణంలో.. నిర్లక్ష్యం వద్దు
- పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మొదలు, రోడ్డుపక్కన టిఫిన్ బండ్ల వరకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారు. రైతుబజార్లు, మార్కెట్లు, బస్టాండ్లు వంటి జనసమ్మర్థ ప్రాంతాలు కరోనా వ్యాప్తికి కేంద్రాలుగా మారుతున్నాయి. పెళ్లిళ్లు, వేడుకలకు వందల మంది హాజరవుతున్నారు. ఇక్కడ భౌతికదూరం, మాస్క్ ధారణ, శానిటైజర్ వాడకం వంటి ప్రాథమిక జాగ్రత్తలు గాలికొదిలేశారు.
- కొందరు మాస్క్‌ను నామమాత్రంగా ధరిస్తున్నారు. గదవ కింది వరకూ లాక్కోవడం, బయటి వైపు తరచూ చేత్తో సర్దుకోవడం, మాట్లాడేటప్పుడు తీసేయడం వంటి చర్యలతో మాస్కు ధరించిన ప్రయోజనం లేకుండాపోతుంది.
- వ్యాక్సిన్ వేయించుకున్నవారు తమకేమీ కాదన్న భరోసాతో, జాగ్రత్తలు తీసుకోకుండా తిరిగేస్తున్నారు. కొందరు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలున్నా.. ముందుకు రావడం లేదు.
- కొందరు జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలున్నప్పటికీ వెంటనే పరీక్షలు చేయించుకోవడం లేదు. సొంత వైద్యం మీద ఆధారపడుతున్నారు. వారికి కరోనా సోకిందని గుర్తించేలోగా ఇంట్లో వాళ్లకు, చుట్టుపక్కల వారికి అంటుకుంటోంది.
- ప్రాథమిక లక్షణాలున్నా వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లడం, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, పాజిటివ్ అని తేలితే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

నిబంధనలు పాటిస్తే.. నియంత్రణ సాధ్యమే..!
ఎంతమంది ఉన్నా.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కు ధరిస్తే.. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు. విద్యార్థులు ఎంతో చక్కగా మాస్కు ధరించి.. ఒకరికొకరి మధ్య నాలుగు అడుగుల దూరం పాటిస్తూ నిలబడ్డారు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని నియంత్రించగలమని విజయవాడ జమ్మిచెట్టు దగ్గరున్న బోయపాటి శివరామకృష్ణయ్య నగరపాలక పాఠశాల విద్యార్థులు చెబుతున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు 1350 మంది ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో ఇలా ఉదయం మైదానంలో ప్రార్థన చేయడానికి సమావేశమయ్యారు.
ఇదీ చూడండి. నెలలో కోటి మందికి కరోనా టీకాలు : సీఎం జగన్