రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపై కరోనా వరుసగా రెండో ఏడాదీ దెబ్బ(CORONA IMPACT) కొడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.14,000 కోట్లకుపైగా ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే తొలి 3 నెలల గణాంకాలను పరిశీలిస్తే సుమారు రూ.27,000 కోట్లే వచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, పన్నేతర రాబడితోపాటు కేంద్రం నుంచి ప్రతి నెలా వచ్చే జీఎస్టీ(GST), ఎస్‌జీఎస్‌టీ(SGST) వంటివి కలిపే ఉన్నాయి.
ఖజానాకు తగ్గిన రాబడి..
ఏప్రిల్‌లో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా.. మే, జూన్ నెలల్లో ఆదాయాలు బాగా తగ్గిపోయినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. కరోనా రెండో దశ తీవ్రత పెరిగి మే నెల నుంచి కార్యకలాపాలు తగ్గిపోవడం, కర్ఫ్యూ వంటి ఆంక్షలు ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.11,300 కోట్ల ఆదాయం సమకూరింది. మే, జూన్ నెలలకు వచ్చేసరికి అది రూ.8,000 కోట్లకు పడిపోయింది. ఈ 3 నెలల్లోనూ మొత్తం రాబడిలో సగం కేంద్రం నుంచి పన్నుల ఆదాయం రూపంలో వచ్చిందే కావడం గమనార్హం.
చెల్లింపులకూ చాలని దుస్థితి..
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి నెల నెలా వస్తున్న రాబడి నిర్వహణ ఖర్చులకూ చాలదని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, అప్పులు, వాటికి వడ్డీ చెల్లింపులకూ ఈ ఆదాయం సరిపోయే పరిస్థితి లేదని పేర్కొంటున్నాయి. అదనంగా ఇతరిత్రా మార్గాల్లో ఆదాయం రాబట్టగలిగితేనే రోజులు వెళ్లదీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాష్ట రాబడి.. కేంద్రం నుంచి వచ్చినవి..
* సుమారుగా అందిన లెక్కల ప్రకారం ఏప్రిల్ నెల మొత్తం రాబడిలో రాష్ట్ర ఆదాయం రూ.6,100 కోట్లు. కేంద్రం నుంచి వచ్చింది రూ.5,200 కోట్ల వరకు ఉంది. పన్నేతర ఆదాయం సుమారు రూ.250 కోట్లు, వాహనాల పన్ను రూపేణా రూ.260 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం దాదాపు రూ.వెయ్యి కోట్లు లభించింది.
* మే నెలలో వచ్చిన సుమారు రూ.8,000 కోట్ల ఆదాయంలో కేంద్రం నుంచి సుమారు రూ.3,500 కోట్లు అందింది. మిగిలిన రూ.4,500 కోట్లు రాష్ట్ర రాబడి.
* జూన్ 25వ తేదీ వరకు దాదాపు రూ.8,000 కోట్ల ఆదాయం సమకూరింది.
ఇవీ చదవండి:
డ్రోన్ల దాడిపై విచారణ- ఆర్డీఎక్స్ వాడారా?
TDP Sadhana Deeksha: నేడు తెదేపా 'సాధన దీక్ష'.. పాల్గొననున్న చంద్రబాబు