పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలో ఎంపీడీవో, ఇన్‌ఛార్జి తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణయింది. ఇన్‌ఛార్జి తహసీల్దార్‌కు కరోనా రావడంతో కొన్ని రోజులుగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, అడంగల్‌లో మార్పులు వంటివి పూర్తిగా నిలిచిపోయాయి. స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు విధుల్లో లేనందున తామేమీ చేయలేమని కార్యాలయాల్లోని సిబ్బంది చెబుతున్నారు.
గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ అందే ప్రభుత్వ సేవలపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో ప్రజలను కలవాలంటేనే ఉద్యోగులు, సిబ్బంది జంకుతున్నారు. కొన్ని కార్యాలయాల్లో సిబ్బందికి పాజిటివ్ నమోదవడంతో తాత్కాలికంగా మూసేస్తున్నారు. ఫలితంగా సమస్యలను విన్నవించేందుకు వస్తున్న సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం కాపు నేస్తం, వైఎస్‌ఆర్ చేయూత తదితర పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.
వీటి కోసం కుల, ఆదాయ ధ్రువీకరణ తదితర పత్రాలను ఆన్‌లైన్‌లో పొందే అవకాశమున్నా.. పలువురు కార్యాలయాలకే వస్తున్నారు. మీ-సేవ కేంద్రాలు కొన్నిచోట్ల కంటెన్మెంట్ జోన్లలో ఉండడంతో వారికి ప్రధాన కార్యాలయాలకు రావడం తప్పనిసరవుతోంది.
కొన్నిచోట్ల 10 శాతమే హాజరు
రాష్ట్ర సచివాలయంలో 35 మంది ఉద్యోగులకు కరోనా రావడంతో కొన్ని కీలక శాఖల్లో ఉద్యోగుల హాజరు 10శాతాన్ని మించడం లేదు. మే 21 నుంచి హాజరు గరిష్ఠంగా 60-70% మించడం లేదని తెలుస్తోంది. ఫలితంగా వివిధ శాఖల్లో దస్త్రాలు పెండింగ్‌లో పడుతున్నాయి. సచివాలయంలోని అన్ని శాఖల్లో కలిపి మొత్తం 400 సెక్షన్లు ఉన్నాయి. వీటిలో మే 3 నుంచి జూన్ 3 వరకు పరిశీలించగా.. ఈ-ఆఫీస్ ద్వారా ఒక్కో సెక్షన్‌లో 3 రోజులకు 3 దస్త్రాల చొప్పున పరిష్కారమైనట్లు అధికారులు చెబుతున్నారు. కొందరు ఉద్యోగులు ఇంటి నుంచే ఈ-ఆఫీస్ ద్వారా దస్త్రాలు పరిష్కరిస్తున్నా పెద్దగా పురోగతి లేదు.
స్పందన రద్దయినా.. తగ్గని తాకిడి
కలెక్టర్లు, ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో స్పందన కార్యక్రమాన్ని తాత్కాలికంగా ఆపేశారు. అయినప్పటికీ ప్రతి సోమవారం ఈ కార్యాలయాలకు వచ్చే వారి సంఖ్య భారీగానే ఉంటోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అర్జీలివ్వాలని అధికారులు సూచిస్తున్నా ఫలితం అంతంతమాత్రమే ఉంటోంది.
వారంపాటు ఇబ్బందులే
* కడప జిల్లా సుండుపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఈనెల మొదటి వారంలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చింది. దాని సమీపంలోనూ మరికొన్ని కేసులు నమోదవడంతో సుండుపల్లెను కంటెన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. స్థానిక మీసేవ, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు వారంపాటు మూతపడ్డాయి. దీంతో ‘వైఎస్‌ఆర్ చేయూత’కు దరఖాస్తు చేసుకునేందుకు కుల, ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
* గుంటూరులోని స్త్రీ శిశు సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయంలో కొందరు ఉద్యోగుల కరోనా బారిన పడడంతో జూన్ 29 నుంచి దాన్ని పూర్తిగా మూసేశారు. వారాలపాటు మూసేయడంతో సమస్యల పరిష్కారానికి వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు.
* విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల కార్యాలయంలో పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారంపాటు తాత్కాలికంగా మూసేశారు.
సొమ్ము అందక ఇబ్బందులు
మా గ్రామంలోని పోస్టుమాస్టర్‌కు 12 రోజుల కిందట కరోనా వచ్చింది. పోస్టాఫీసును తాత్కాలికంగా మూసేశారు. మేం జమ చేసుకున్న డబ్బులను తిరిగి తీసుకుందామంటే వీలుకాక ఇబ్బందిగా ఉంది.- మహబూబ్‌బాషా, యాడికి, అనంతపురం జిల్లా