హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా సోకింది. కొంపల్లిలో బంధువు అంత్యక్రియలకు వెళ్లొచ్చిన ఓ విద్యార్థికి 3 రోజుల క్రితం జ్వరం, జలుబు లక్షణాలు కనిపించాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ఫలితంగా విద్యార్థి తండ్రి, తల్లితో పాటు అతని సోదరికీ పరీక్షలు నిర్వహించారు.
వారికీ కరోనా పాజిటివ్ అని తేలడం వల్ల అందరినీ అక్కడే ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేయిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఆ ఇంట్లోని మిగిలిన కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంటి వాచ్‌మన్ కుటుంబాన్నీ హోం క్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటి వరకు బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తాజాగా ఎమ్మెల్యే కాలనీలో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్ అని తేలడం వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేట్ వైద్యురాలికి పాజిటివ్..
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యుడికి 3 రోజుల క్రితం కరోనా సోకగా.. అదే ఆస్పత్రిలో పనిచేస్తూ గ్రీన్ బంజారా కాలనీలో నివాసం ఉంటున్న మరో వైద్యురాలికి సైతం తాజాగా కరోనా సోకింది. వైద్యురాలు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.