- ‘‘చాలా ప్రయత్నించాం.. లక్షలు ఖర్చు చేశాం.. అయినా ప్రయోజనం లేకుండా పోయింది’’- తమ్ముడి మరణంపై అన్నయ్య ఆవేదన.
- ‘‘మా మేనమామ.. కుటుంబానికే ఆధారం. అందరికీ ధైర్యం చెప్పే తనను కాపాడుకోలేకపోయాం’’ - ఓ గృహిణి బాధ ఇది
- ‘‘20 ఏళ్లపాటు కలిసి పనిచేశాం. రెండేళ్లు సర్వీసున్నా నా సహోద్యోగి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. వారం రోజుల క్రితం తాను కరోనాతో మరణించింది. ఇది విన్నాక విధులకు వెళ్లాలనిపించలేదు.. వారం రోజులు సెలవు పెట్టేశాను. - ఓ ఉద్యోగిని కన్నీటి నివేదన.
హాయిగా సంసారం చేసుకుంటూ నవ్వుతూ కనిపించే బిడ్డను కరోనా బలితీసుకుంటే కుమిలిపోతున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చటం ఎవరితరం కావట్లేదు. తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి తానే అంత్యక్రియలు చేయాల్సి వస్తే ఆ కన్నపేగు విలవిల్లాడి పోతోంది. కొవిడ్ తీవ్రత ఇప్పుడు ఇంటింటా గుబులు పుట్టిస్తోంది. కొవిడ్ బారినపడ్డారని తెలిసినప్పటి నుంచి కోలుకుని ఇంటికొచ్చే వరకు బంధువులు, స్నేహితులు పడుతున్న ఆందోళన అంతాఇంతా కాదు. నెల్లూరు చెందిన ఓ కుటుంబం శేరిలింగంపల్లిలో ఉంటారు. ఉగాది సందర్భంగా కుటుంబాలన్నీ ఒకేచోట కలిశాయి. అనంతరం నలుగురు కరోనాతో మరణించారని.. నెలరోజులుగా తాము కోలేకపోతున్నామని ఓ గృహిణి వివరించారు. ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందనే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటూ ఆందోళన వ్యక్తంచేశారు.
వెంటాడే భయాలు..
కళ్లెదుటే.. స్నేహితులు, సహచరులు.. దూరమవుతుంటే.. ఆ బాధను భరించటం నరకప్రాయం. చివరిచూపైనా దక్కకపోవడం అత్యంత బాధాకరం. కొవిడ్ బాధితుల మృతి ఆ కుటుంబాల్లోని వారిపైనేకాక స్నేహితులు, పరిచయస్తులు, ప్రాంతాలపైనా ప్రభావం చూపుతోంది. ఆత్మీయులు, బంధువులు, సహచరుల ఆకస్మిక మరణాలు.. తెలిసిన వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మనస్తత్వ విశ్లేషకులు డాక్టర్ రాంచందర్ మోతుకూరి తెలిపారు. వెంటాడుతున్న భయాలతో ఎన్నిరోజులు గడపాలనే భావన ప్రజల్లో పెరగటం.. మరణాల రేటు అధికం కావడం దీనికి కారణమంటూ విశ్లేషించారు.
ఇమడలేక..
‘కరోనా నుంచి బయటపడ్డాడు. అకస్మాత్తుగా శ్వాస ఆడట్లేదంటూ చెప్పాడు. సిటీస్కాన్ సాధారణంగా ఉంది. ఊపిరాడక మరణించాడు. అంతకు ముందురోజే తన పక్కనే చికిత్స పొందుతున్న రోగి మరణించటంతో ఇతడు ఆందోళనకు గురయ్యాడు’ గుండెదడతో ప్రాణాలు కోల్పోయాడు. భయం ఎంత ప్రమాదకరం అనేందుకు ఇదొక ఉదాహరణ అంటూ గాంధీ ఆసుపత్రి మనస్తత్వ నిపుణుడు డాక్టర్ జూపాక అజయ్‌కుమార్ తెలిపారు.
కొవిడ్‌ను సమయానికి గుర్తించగలిగితే చికిత్స అందుబాటులో ఉంది. 90 శాతం ఇంటి వద్దనే కోలుకుంటున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోకపోవటం వల్ల తలెత్తిన సమస్య ఇది. స్నేహితులు, ఆత్మీయుల మరణాలను జీర్ణించుకోలేకపోతున్నారు. చాలామంది కుంగుబాటుకు గురవుతున్నారు. ఇమడలేకపోవటం మానసిక ఆందోళనకు కారణమవుతుంది. దీని ప్రభావం రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మానసిక ఆందోళన/కుంగుబాటుతో పోషకాహారం, వ్యాయామం, నిద్రకు క్రమంగా దూరమవుతారు. రోగనిరోధక శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలోనే ధైర్యంగా ఉండాలి. మనమంతా కలిసికట్టుగా సమస్యను ఎదుర్కోవాలి.