కరోనా మహమ్మారి అన్ని వయసుల వారి ప్రాణాలను హరిస్తోంది. వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 218మంది చనిపోయారు. వీరిలో 49ఏళ్లలోపు వయసు ఉన్న వారు.. 51మంది ఉన్నారు. మిగిలిన వారి వయసు.... 50 నుంచి 92 ఏళ్ల మధ్య ఉంది. ఇప్పటికే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వైరస్ బారినపడిన వారు సకాలంలో చికిత్స పొందడంలో జాప్యం జరిగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాలేయ సమస్యతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలిక వైరస్ బారినపడి ప్రాణాలు విడిచింది. 20 నుంచి 29 సంవత్సరాల మధ్య ఆరుగురు మరణిస్తే వీరిలో ఇద్దరు గర్భిణులు ఉన్నారు. రక్తహీనత ఇతర అనారోగ్య కారణాల వల్ల వీరు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారిలో.. రక్తపోటు మధుమేహంతో బాధపడుతున్న వారు 90శాతం మంది ఉన్నారు. వీటితో పాటు మూత్రపిండాల సమస్య, ఉబ్బసం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ వైరస్‌కు చిక్కి ప్రాణాలు విడిచిన వారు 72మంది ఉన్నారు. మృతుల్లో 49మంది మహిళలు ఉన్నారు.
లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోకపోవడం.. చేయించుకున్న తర్వాత ఫలితం ఆలస్యంగా రావడం... ఆసుపత్రిలో చేరడంలో జాప్యం వంటి కారణాల వల్ల కూడా మరణాలు చోటుచేసుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన 5 రోజుల్లో ఆసుపత్రుల్లో చేరి.. సత్వరం చికిత్స పొందితే ప్రాణాలు దక్కే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. కొందరు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకోకుండా ఇష్టమొచ్చిన మందులను వాడి ప్రాణాలపై తెచ్చుకుంటున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఈ వందేళ్లలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు ఇవే..