రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా జడలు విప్పింది. తొలి కేసు నమోదైన తర్వాత 20 రోజులు నెమ్మదిగా వ్యాపించిన వైరస్.. ఆ తర్వాత ఉగ్రరూపం దాల్చింది. మొదటి 20 రోజుల్లో సగటున రోజుకు ఒక్కో కేసే నమోదవగా.. తర్వాత ఆరు రోజుల్లో సగటున రోజుకు 28 కేసులు నమోదయ్యాయి. శనివారం వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 90%కు పైగా దిల్లీ తబ్లీగీ జమాత్ సదస్సులో పాల్గొన్నవారు, వారికి సన్నిహితంగా మెలిగినవారే! రాష్ట్రంలో శనివారం సాయంత్రం వరకు 194 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో మార్చి 29 వరకు 21 కేసులు నమోదవగా, మార్చి 30 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆరు రోజుల్లో మరో 169 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో తొలి 161 కేసుల వివరాలు ఇలా..
- కరోనా సోకిన మొదటి ముగ్గురూ విదేశాల నుంచి వచ్చిన పురుషులే.
- నెల్లూరు యువకుడికి కరోనా సోకినట్టు మార్చి 10న నిర్ధారించారు. రాష్ట్రంలో తొలి కేసు అదే. రెండో కేసు మార్చి 18న, మూడో కేసు మార్చి 19న నమోదయ్యాయి.
- మొదటి కేసు నమోదైన 15 రోజులకు పదో కేసు, 19రోజులకు 20వకేసు నమోదయ్యాయి.
- తొలి 10 కేసుల్లో 8 మంది విదేశాల నుంచి వచ్చినవారు, ఒకరు దిల్లీ నుంచి వచ్చినవారు. మరొకరు మదీనా నుంచి వచ్చిన వ్యక్తి భార్య.
- మొత్తం 161 మందిలో మహిళలు 16 మంది.
- రాష్ట్రంలో ఇంత వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు.
30-49 ఏళ్ల మధ్యవారే ఎక్కువ
- శుక్రవారం వరకు వచ్చిన 161 కేసుల్లో 9 మంది వయసు వివరాలు లేవు.
- మిగతా 152 మందిలో 80 మంది 30-49 ఏళ్ల మధ్యవారే.
- అత్యంత పిన్నవయసు పదేళ్లు కాగా, అత్యధిక వయసు 80 ఏళ్లు.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా కర్నూలు జిల్లాలో కొవిడ్-19 డిస్ఇన్ఫెక్టెంట్ ఛాంబర్‌ను శనివారం ఏర్పాటు చేశారు. నంద్యాల మండల కేంద్రంలోని శాంతిరాం వైద్యశాలను కొవిడ్-19 వైద్యశాలగా గుర్తించారు. వైద్యశాలకు వచ్చే సిబ్బంది, వైద్యులు, ఇతరులు ఈ గది ద్వారానే లోపలికి వెళ్లే విధంగా ఏర్పాట్లుచేశారు. దీని ద్వారా వెళ్తే అందులో నుంచి వెలువడే సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే శరీరం, దుస్తులపై ఉండే వైరస్‌ను నాశనం చేస్తుందని శాంతిరాం వైద్యశాల వైస్ ఛైర్మన్ మాధవీలత తెలిపారు.
ఇదీ చదవండి: రైతులెవరూ నష్టపోకుండా చూడాలి: సీఎం