తూర్పుగోదావరి జిల్లాలో కరోనా బుసలు కొడుతోంది. మంగళవారానికి జిల్లాలో కేసుల సంఖ్య 303కు చేరినట్లు అధికారులు ప్రకటించారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో గతనెల 21న నమోదైన పాజిటివ్ మరణానికి అనుబంధంగా జిల్లాలో ఇప్పటివరకు 157 కేసులు నమోదయ్యాయి. ఆ గ్రామంలోనే ఈ సూపర్ స్ప్రెడర్ కలకలానికి 117 మంది వైరస్ బారినపడ్డారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి.. కీలక విభాగాలను అందుబాటులో ఉంచారు.
గ్రామం మొత్తాన్ని కట్టడి ప్రాంతంగా మార్చి రాకపోకలు నిలిపివేశారు. 5,300 కుటుంబాలు.. 21వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో గుండెలు అరచేత పట్టుకున్నారు. లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలవుతుండగా గ్రామంలో హోటల్‌కు అనధికారిక అనుమతులు ఇవ్వడమే వైరస్ వ్యాప్తికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీల్లో వైరస్ బయటపడుతోంది. దీంతో జిల్లాకు వచ్చేవారందరికీ పరీక్షలు చేస్తున్నారు.
గుంటూరులో 26 మంది కూరగాయల వ్యాపారులకు..
ఒకప్పుడు గుంటూరులో హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ బస్టాండు పక్కనే ఉండేది. లాక్‌డౌన్ కారణంగా దాన్ని శివార్లలోని ఏటుకూరు బైపాస్ వద్దకు తరలించారు. ఇప్పుడు ఆ మార్కెట్‌లోని 26 మంది వ్యాపారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఒక్కరోజే 18 మందికి వైరస్ సోకడంతో నగరంలో కలకలం రేగింది. దీంతో మార్కెట్‌ను పూర్తిగా మూసివేయించి వ్యాధి నివారణ చర్యలు చేపట్టారు.
ఇక్కడ పెద్దమొత్తంలో రిటైల్ వ్యాపారులు, వినియోగదారులు కూరగాయలు కొనేవారు. దాంతో ఇది కూడా మరో కోయంబేడు మార్కెట్‌లా తయారవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడి మార్కెట్లలో 450 మంది వ్యాపారులున్నారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించగా 26 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నగరంలోని రెడ్‌జోన్‌లో ఉంటూ నిత్యం మార్కెట్‌కు వచ్చే ఓ వ్యాపారికి తొలుత వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, ఆయన ద్వారానే అందరికీ వ్యాపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నగర కమిషనర్ అనూరాధ, డీఎస్పీ కమలాకర్ తదితరులు మార్కెట్‌ను సందర్శించారు. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యాపారవర్గాలతో చర్చించిన తర్వాతే మార్కెట్‌ను తెరుస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: