TRS Resolutions on Paddy Grain Procurement: పంజాబ్‌లో సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణలో పండించిన వడ్లను మొత్తం కొనుగోలు చేయాలని కోరుతూ.. ప్రధాని మోదీకి తీర్మానాలు పంపించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మార్కెట్ కమిటీలు, పురపాలక సంఘాలు, రైతుబంధు సమితుల్లో తీర్మానాలు చేసి పోస్టు, కొరియర్‌ల ద్వారా ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు పంపించాలని ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సూచించింది. వారి చిరునామాలను వాట్సప్ ద్వారా తెలియజేసింది. కాపీల ప్రతులను సీఎంకూ పంపించాలని సూచించింది.
Paddy Procurement Issue : కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం వివాదం ముదురుతూనే ఉంది. రాష్ట్రాల్లో ఉత్పత్తి మేరకు ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్రం స్పష్టం చేయగా.. యాసంగిలో పండిన వడ్లను మొత్తం కొనాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యాసంగిలో ఎక్కువగా నూకలే అవుతాయని.. వాటిని తెలంగాణ ప్రజలకు అలవాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిపై విమర్శలు గుప్పించారు.
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనాలని అడిగితే.. అవహేళగా మాట్లాడుతున్నారని.. రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ.. ఉగాది తర్వాత ఉద్ధృతంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్.. నూకలు తినాలన్న వ్యాఖ్యలపై అమాత్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మంత్రులను అవహేళన చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయట్లేదని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: 'కేంద్రమంత్రి నూకలను తినమన్నారంటూ తెరాస దుష్ప్రచారం చేస్తోంది'