అన్ని రకాల ఖర్చులు పెరిగి అల్లాడుతున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మరో భారం మోపింది. మట్టి మిద్దెల నుంచి.. ఆకాశహర్మ్యాల వరకు అన్ని రకాల నిర్మాణాల మార్కెట్ విలువలను పెంచేసింది. సినిమాహాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్లఫారాల భవన నిర్మాణాలపైనా వడ్డించింది. తాటాకు, కొబ్బరాకులు, రెల్లుగడ్డితో కప్పే గుడిసెలపైనా చదరపు అడుగుకు అదనంగా రూ.10 చొప్పున బాదేసింది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా.. ప్రస్తుత విలువలపై సగటున 5% చొప్పున పెంచడం వల్ల ప్రజలపై ఏటా రూ.125 కోట్లకు పైగా భారం పడనుంది. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అన్ని ప్రాంతాలతోపాటు మేజర్ పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోనూ పెరిగిన విలువలపైనే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు. దీంతో చిన్నపాటి ఇల్లు కొనుక్కోవాలనుకునే పేద, మధ్యతరగతి వర్గాలతోపాటు.. ఫ్లాట్ కొనుక్కుందామని ఆశపడే ఉద్యోగ, వ్యాపార వర్గాలపైనా అదనంగా (1500 చదరపు అడుగులకు) సగటున రూ.6 వేల పైనే భారం పడుతుంది. భవన నిర్మాణాల రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగే పట్టణ ప్రాంతాలు, మేజర్ పంచాయతీల పరిధిలో ఎక్కువ మొత్తంలో పిండేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెంపుదల జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. సాధారణంగా నిర్మాణాల కొత్త మార్కెట్ విలువలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచింది. ఇప్పుడు నిర్మాణాల మార్కెట్ విలువలూ పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడనుంది.
చదరపు అడుగుకు రూ.40- రూ.60 వరకు పెంపు
* పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని నిర్మాణాలపై చదరపు అడుగుకు ప్రస్తుతం ఉన్న విలువపై గరిష్ఠంగా రూ.60 వరకు పెంచారు.
* మేజర్ పంచాయతీల పరిధిలోని నిర్మాణాలపైనా గరిష్ఠంగా రూ.60 వరకు బాదుడు కొనసాగించారు.
* గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలపై చ.అ.కు రూ.40 చొప్పున పెంచారు.
* మూడో అంతస్తు నుంచి పైన ఉండే నిర్మాణాలకు గతంలో చ.అడుగుకు పట్టణ ప్రాంతాల్లో రూ.1,240 ఉండగా దాన్ని రూ.1,300 చేశారు.
* మేజర్ పంచాయతీల్లో రూ.1,140 నుంచి రూ.1,200, గ్రామీణ ప్రాంతాల్లో రూ.530 నుంచి రూ.560 చేశారు.
* మూడువైపులా ఉమ్మడి గోడలు లేని అపార్ట్‌మెంట్ నిర్మాణాలపై చదరపు అడుగుకు పట్టణ ప్రాంతాల్లో గతంలో రూ.1,240 ఉంటే ఇప్పుడు రూ.1,300 చేశారు.
* సిమెంటు రేకులు, నాపరాతి నిర్మాణాలకు సంబంధించి పట్టణ ప్రాంతాలు, మేజర్ పంచాయతీల్లో చదరపు అడుగుకు రూ.30, గ్రామాల్లో రూ.20 చొప్పున పెరిగింది.
* చవిటి మిద్దెలకు చదరపు అడుగుకు పట్టణ ప్రాంతాల్లో రూ.370 నుంచి రూ.390కి, మేజర్ పంచాయతీల్లో రూ.280 నుంచి రూ.290కి, గ్రామాల్లో రూ.210 నుంచి రూ.220కి పెంచారు.
* అసంపూర్తి నిర్మాణాలు పునాది స్థాయిలో ఉంటే 25%, స్లాబ్ స్థాయిలో 65%, పూర్తయ్యే దశలో 85% చొప్పున వసూలు చేస్తారు.
ప్రజలపై ఆర్థిక భారం ఇలా..
పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో.. స్థలం విలువతో
ఇదీ చదవండి: "జైలు భోజనం" రుచి చూశారా..? ఈ ఫొటోలు చూస్తే జైలుకు వెళ్లాల్సిందేనంటారు!