పదో తరగతి పరీక్షల సమయంపై అధికారుల ఉత్తర్వులు విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నాయి. పరీక్షల షెడ్యూల్, గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో పరీక్ష సమయం 3.15 గంటలని చెప్పగా.. తాజా ఉత్తర్వుల్లో 2.45గంటల సమయమే ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
సచివాలయంలో ఈనెల 3న పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినప్పుడు ఉదయం 9.30 నుంచి 12.45వరకు పరీక్ష సమయమని విద్యాశాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. ఇందుకు విరుద్ధంగా ఉత్తర్వు-11ను విద్యాశాఖ అధికారులు జారీచేశారు. పరీక్షల్లో అరగంట అదనపు సమయం ఉంటుందా లేదా అనేదానిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
గత ఏడాది 11 పరీక్షలను ఆరుకు తగ్గించి, అరగంట సమయం పెంచారు. ఈసారి పరీక్షలను ఏడుకు పెంచినా అదనపు అరగంటను తొలగించారు. ఒకేసారి పాఠాలన్నీ చదివి పరీక్ష రాయాల్సి వస్తుండగా అరగంట సమయం తొలగింపుపై విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. పదో తరగతి పరీక్షలకు 2.45గంటలున్న సమయాన్ని 3.15గంటలకు పెంచుతూ గతేడాది జూన్ 12న పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది.
కరోనా కారణంగా పరీక్షలను ఆరుకు కుదిస్తున్నామని, ఇది విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుందని పేర్కొంది. ప్రశ్నల సంఖ్యలో మార్పు చేయకుండా 50 మార్కులను వంద మార్కులకు పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజాగా గురువారం పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వు-11లో పరీక్ష రాసేందుకు సమయం 2.30గంటలేనని వెల్లడించింది. గతేడాది జనవరిలో ఇచ్చిన ఉత్తర్వు-3 ప్రకారం సమయం ఇవ్వనున్నట్లు పేర్కొంది.
దీని ప్రకారం ప్రశ్నపత్రం చదువుకునేందుకు అదనంగా ఇచ్చే 15 నిమిషాలు కలిపి 2.45 గంటలే ఉంటుంది. గత సంవత్సరం జనవరిలో ఇచ్చిన ఉత్తర్వును పరిగణలోకి తీసుకున్న అధికారులు జూన్‌లో జారీ చేసిన ఆదేశాలను వదిలేశారు.
* పదోతరగతి పరీక్షల్లో బిట్‌పేపర్ లేనందున అన్ని ప్రశ్నలకూ పూర్తి సమాధానాలే రాయాల్సి ఉంటుంది. సామాన్య శాస్త్రం మినహా మిగతా ప్రతి సబ్జెక్టులోనూ 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
ఇదీ చదవండి: