RESURVEY: భూముల రీ - సర్వే గందరగోళంగా మారింది. కొందరు రైతులకు భూమి విస్తీర్ణం తగ్గడం, మరికొందరికి పెరుగుతుండడం వల్ల.. వారికి ఏమాత్రం భరోసా ఉండట్లేదు. 50, 60 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూముల విస్తీర్ణం తగ్గిందంటూ.. సర్వే, రెవెన్యూ సిబ్బంది చెప్పడం వల్ల.. కంగారు పడుతున్నారు. పాసు పుస్తకాలు, డాక్యుమెంట్లలో ఉన్న భూమికి, సర్వేలో చెప్పేదానికి.. కొన్నిచోట్ల సంబంధం ఉండడం లేదు. కొలతల్లో వ్యత్యాసాలతో.. రైతుల మధ్య మనస్పర్థలూ వస్తున్నాయి. గ్రామ సచివాలయాల్లో సర్వే, రెవెన్యూ సిబ్బంది రైతుల ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలూ ఉన్నాయి.
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హక్కు - భూరక్ష పథకం కింద జరుగుతున్న భూముల రీ-సర్వేలో.. నేలబావులు, ఉమ్మడిదారులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో భూసేకరణ జరిగిన పొలాల దగ్గర మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. తొలివిడత కింద ప్రకటించిన 51 గ్రామాల్లో రీ-సర్వే పూర్తై నెలలు గడుస్తున్నా ఆన్‌లైన్ అడంగల్‌లో పాత సర్వే నంబర్లు, పాత విస్తీర్ణాలే కనిపిస్తున్నాయి. రైతులకు కొత్తగా.. పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదు. ఫలితంగా భూముల క్రయ, విక్రయాలు ఏ రికార్డుల ప్రకారం చేస్తారో తెలియట్లేదు. రీ-సర్వే పూర్తైనా..చాలాచోట్ల హద్దురాళ్లే నాటలేదు. రైతులే నాటుకోవాలని సిబ్బంది చెబుతున్నారు.
రీ-సర్వేలో దస్తావేజులు లేకుండా పూర్వార్జితం కింద నమోదైన కేసుల్లో.. మరిన్ని సమస్యలు వస్తున్నాయి. ఆర్ఓఆర్/ వెబ్‌ల్యాండ్‌లో సర్వే నంబరుకు విస్తీర్ణానికి మించి నమోదవుతోంది. వీరి వద్ద దస్తా వేజులు లేకపోవడం వల్ల వాస్తవ విస్తీర్ణం తేలట్లేదు. ఫలితంగా..వారి విస్తీర్ణం తగ్గుతుండగా తామేమీ చేయలేమని సిబ్బంది చెబుతున్నారు. హక్కులకు అనుగుణంగా నీటిపన్ను చెల్లిస్తూ బ్యాంకుల నుంచి రుణాలు పొందుతుండగా రీ-సర్వేలో తగ్గుతుండడం వల్ల అన్నదాతలు జీర్ణించుకోలేకపోతున్నారు . రీ-సర్వే నిబంధనల ప్రకారం తొలుత భూమి పాత హద్దులను గుర్తించి సర్వే నంబరులో ఉన్న భూమి విస్తీర్ణం ప్రకారం సబ్‌డివిజన్ చేయాలి. అనంతరం సర్వే చేసి.. ప్రతి ఒక్కరికీ హద్దులు చూపించి.. అప్పీళ్లపై విచారణ, నిర్ణయాలు జరిగిన తర్వాత సర్వేరాళ్లు పాతాలి. కానీ ఈ ప్రక్రియపై రైతుల్లో పూర్తి అవగాహన లేదు. తాత ముత్తాల కాలం నుంచి తమ అధీనంలో ఉన్న భూమి విస్తీర్ణం తగ్గినట్లు సర్వే సిబ్బంది చెబుతుంటే మండిపడుతున్నారు.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాధుని కండ్రిగ అగ్రహారంలో డొంకరోడ్లు అక్రమణలకు గురై.. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తాతల నుంచి వచ్చిన భూమిలో.. రీ-సర్వే తర్వాత కొంత కోల్పోయామని వాపోతున్నారు. కొలతల సమస్యలను రైతులే పరిష్కరించుకోవాలన్న సర్వే సిబ్బంది సూచనలపై.. అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేం మేం మాట్లాడుకుంటే రీ-సర్వే ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
రైతులు ఇప్పటివరకూ తమ పొలాలకు ఉన్న గట్లనే భూహద్దులుగా భావించి దున్నుకుంటున్నారు. అధికారులు ఇచ్చిన పత్రాలకు అనుగుణంగా గట్లు మార్చేందుకు చాలాచోట్ల పొరుగు పొలాల రైతులు అంగీకరించట్లేదు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం శివరామపురంలో 483 ఎకరాలు ఉండగా.. రీ-సర్వే తర్వాత 463 ఎకరాలకు తగ్గాయి. దాదాపు 12 మంది రైతులు.. అధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు 2.4 ఎకరాలు ఉండగా..రీసర్వే తర్వాత 1.97 ఎకరాలు చూపించారంటూ..శ్రీనివాసులు అనే వ్యక్తి వాపోయారు. పొలం పది సెంట్ల వరకూ తగ్గిందని రాయి పాతారు గానీ.. ఆ మేరకు భూమి సర్దుబాటు చేసి చూపించలేదన్నారు
ఉమ్మడి కడప జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలోని 3 గ్రామాల్లో.. దాదాపు 95 శాతం భూసర్వే పూర్తైంది. పులివెందుల మండలం రాగిమానుపల్లెలో..800 ఎకరాలకుపైగానే ఉంది. ఒక్కో రైతుకు 4 నుంచి 10, 20 సెంట్ల వరకు తక్కువ, మరికొందరికి 10 నుంచి 15 సెంట్ల వరకు ఎక్కువ చూపించింది. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చొల్లంగిపాలెంలో 54.78 ఎకరాల భూమిని రెండేళ్లపాటు సర్వే చేశారు. 60 మందికి రైతులకు చెందిన 24.61 ఎకరాల పల్లం భూములు.. 2.30 ఎకరాల మెట్ట భూములతో పాటు.. 17.87 ఎకరాల పోరంబోకు స్థలాన్ని డ్రోన్ సర్వే ద్వారా ల్యాండ్ పార్శిల్ మ్యాప్ నంబర్లు సృష్టించారు. కొందరు రైతులు కొంత భూమి కోల్పోగా, కొందరికి అదనంగా కలిసొచ్చింది. సర్వే పూర్తై ఆర్నెళ్లు దాటినా ఇప్పటికీ పాసుపుస్తకాలు ఇవ్వలేదని, ఓ రైతు వాపోయారు. ఆన్‌లైన్‌లో 1B, అడంగల్ వివరాలూ లేకపోవడం వల్ల.. బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదంటున్నారు. గ్రామ ఎల్పీఎమ్ నంబర్లను సచివాలయానికి అనుసంధానం చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లూ జరగడం లేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వురుపాడులో రీసర్వే సమయంలో అదనంగా భూమి ఉందని తేల్చి పక్కనవారికి కలిపారు. అందువల్ల,రైతులు విభేదించి మళ్లీ రీసర్వే చేయాలంటున్నారు. ఇక ఈ కొత్త పద్ధతి వల్ల చాలాచోట్ల కుటుంబసభ్యుల మధ్య గొడవలు వచ్చాయి.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌లోని అక్కంపేటలో రీ-సర్వే తర్వాత కొందరికి భూవిస్తీర్ణం తగ్గి, మరికొందరికి పెరిగింది. సెంటు భూమి ఖరీదు లక్ష రూపాయలు కావడం వల్ల నష్టపోయామని రైతులు వాపోతున్నారు. విజయవాడ డివిజన్‌లో జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట, బందరు డివిజన్ బందరు మండలంలోని పొట్లపాలెం నూజీవీడు డివిజన్‌లో మర్రిబందం, గుడివాడ డివిజన్‌లో మెరకగూడెంలో హద్దుల కేటాయింపులో ఇంకా సమస్యలు అలానే ఉన్నాయని రైతులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం కొండజాగర్లమూడిలో దాదాపు అందరి గట్లూ మారుతున్నాయి.
రీ-సర్వే కోసం గుర్తించిన గ్రామాల్లో...రైతుల సమక్షంలోనే...వారి భూముల్లోనే కొలతలు వేసి విస్తీర్ణాలను నిర్ధరిస్తున్నామని...అధికారులు అంటున్నారు. డ్రోన్ల ద్వారా వచ్చిన ఛాయాచిత్రాలు, రోవర్ల ద్వారా భూముల యథాస్థితి గుర్తిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.
పేదలకు అసైన్డ్ భూములు ఇచ్చినప్పుడు ప్రభుత్వ భూమిని సాగు భూమిగా మారుస్తూ ఉత్తర్వులివ్వాలి. అయితే అలా మార్చకుండానే పేదలకు డీకేటీ పట్టాలు ఇచ్చారు. కన్వర్షన్ జరగనందున ప్రభుత్వ భూమిగానే రికార్డుల్లో ఉంది. ఈ కేసులు ఎక్కువగా చెరువు పోరంబోకు భూముల విషయంలో ఉన్నాయి. జలవనరుల స్థలాలను అసైన్ చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. దీంతో రీ-సర్వేలో..వీటిని చెరువు పోరంబోకుగా చూపిస్తున్నారు. రీ-సర్వే వల్ల.. అన్నదమ్ముల పంపకాల్లోనూ వ్యత్యాసాలు వస్తున్నాయి. కాగితాలు లేనందువల్ల సిబ్బంది ఉమ్మడిగా పెట్టేస్తున్నారు. సర్వే హద్దుల చట్టం ప్రకారం బావులను విభజించలేరు. ఈ విషయంలోనూ స్థల వివాదాలు వస్తున్నాయి.
ఇవీ చదవండి: