RTC Compassionate appointments: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ‘మెడికల్ అన్‌ఫిట్’ అయిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు చేపడతామని గతంలో ఆ సంస్థ యాజమాన్యం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అదే యాజమాన్యం లేదు పొమ్మంటూ చేతులెత్తేసింది. దీంతో ఇన్నాళ్లు ఎదురుచూసిన వారు ఆవేదనకు గురవుతున్నారు. వివిధ కారణాలతో మెడికల్ అన్‌ఫిట్ అయినవారికి.. అయిదేళ్లకు పైగా సర్వీసు ఉండి, ఆర్థిక ప్రయోజనాలు వదులుకుంటే వారసులకు కారుణ్య నియామకాలు చేపడతామని 2015లో ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగుల వారసులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఉత్తర్వులకు బోర్డు ఆమోదంలేదని, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనానికి ముందు వరకు (2019, డిసెంబరు 31 వరకు) మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వలేమంటూ రవాణాశాఖ గతనెల 7న మెమో జారీ చేసింది. దీంతో 2015 నుంచి 2019 చివరి వరకు మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు అదనపు మోనిటరీ బెనిఫట్ ఫండ్, నోషనల్ పీఎఫ్, గ్రాట్యూటీ అందజేయాలంటూ ఆర్టీసీ ఎండీ గతనెల 15న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 175 మంది మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగుల కుటుంబాలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
ఆదుకోవాల్సిన సంస్థే.. కాదు పొమ్మంటే ఏం చేసేది..
నెల్లూరు జిల్లా గూడూరు డిపోలో కండక్టర్‌గా పని చేసిన ఓజిలి భాస్కర్‌రావుకు 2017లో పక్షవాతం రావడంతో కుటుంబసభ్యులు రెండేళ్లపాటు వైద్యం అందించారు. 2019లో మెడికల్ అన్‌ఫిట్ చేశారు. ఆ సమయంలో కుమారుడికి ఉద్యోగం ఇవ్వండని కోరారు. దరఖాస్తు కూడా తీసుకున్నారు. ఇంతకాలం ఎదురుచూశాక, ఇప్పుడు ఆ అవకాశంలేదని ప్రకటించారు. అతని కుమారుడు రూ.10 వేల జీతానికి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ, కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
ఇదీ చదవండి :