ఏపీఎస్ఆర్టీసీలో పని చేస్తూ మృతిచెందిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద జాబ్ ఇచ్చేందుకు ఆర్టీసీ అంగీకరించిందని, వారిపట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం ఉందని, త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, కడప, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఆర్టీసీ కారుణ్య నియామక అభ్యర్థులు మంత్రిని కలిసి తమ సమస్యలను చెప్పారు. తమవారు ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో అకాల మరణం చెందారని మంత్రికి వివరించారు. కొంత కాలంగా కారుణ్య నియామకాలు లేకపోవటంతో తాము ఇబ్బంది పడుతున్నట్టు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 910 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రికి తెలిపారు.
స్పందించిన మంత్రి పేర్నినాని.. త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకు కారుణ్య నియామకాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. కరోనా కారణంగా ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉందని, బస్సులు తిప్పే పరిస్థితి లేదన్నారు. అయినా ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుభూతితో ప్రభుత్వం త్వరలో కారుణ్య నియామకాలు చేపడతుందని స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్‌పై తుది నిర్ణయానికి ఐఏఎస్ అధికారులు వారం కిందటే ఏకాభిప్రాయానికి వచ్చారని వివరించారు. ఆర్టీసీ ఎండీ, ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశం అనంతరం... కారుణ్య నియామకాలను చేపడతామని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ... JAGAN-CHIRU TWEETS: చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన జగన్..ఏమన్నారంటే