కరోనా నుంచి కాపాడుతుందనే నమ్మకంతో ప్రజలు శానిటైజర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇది ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి సంస్థలు. వైరస్ బారి నుంచి కాపాడే శానిటైజర్‌ను ఇథైల్ (ఇథనాల్) ఆల్కహాల్‌తో తయారుచేయాల్సి ఉండగా.. కొందరు చౌకగా వస్తుందని మిథైల్ (మిథనాల్) ఆల్కహాల్‌తో తయారుచేస్తున్నారు. ‘మిథైల్’ ఆధారిత శానిటైజర్ వాడితే చర్మ సమస్యలతో పాటు ఇతర అనారోగ్యం బారినపడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నకిలీ, నాసిరకం శానిటైజర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ దృష్టిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నమూనాల సేకరణకు అన్ని జిల్లాల్లోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలిచ్చింది.
వేటితో మేలు?
* జిగురు, నురుగు మాదిరి కంటే ద్రావణం మాదిరిగా ఉండే శానిటైజర్లతోనే ఎక్కువ ప్రయోజనం.
* చేతుల్లో వేసుకొని రుద్దుకున్న తర్వాత ఒక నిమిషంలో అది ఆవిరవ్వాలి. అలా కాకుండా చేతులకు అంటుకుని ఉంటే చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి.
* శానిటైజర్లలో 60-90 శాతం వరకూ ఆల్కహాల్ ఉండాలి. అంతకంటే తగ్గినా, ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితం రాకపోగా, కొత్త సమస్యలొస్తాయి.
* కనీసం 20-30 సెకన్ల పాటు చేతులకు రుద్దుకోవాలి.
ఏ రకం శ్రేయస్కరం?
వాడాల్సినవి: ఇథైల్ ఆల్కహాల్, ఐసో ప్రొపైల్ ఆల్కహాల్, ఎన్ ప్రొపైల్ ఆల్కహాల్ ఆధారితమైనవి.
వాడకూడనివి: మిథైల్ ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు.
మిథైల్ ఆల్కహాల్‌తో ఏమిటి ప్రమాదం?
* మిథనాల్‌తో తయారు చేసిన శానిటైజర్‌లో హానికారక పదార్థాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) హెచ్చరించింది.
* వీటిని వినియోగించడం వల్ల విషపూరిత పదార్థాలు శరీరంలోకి వెళ్లే అవకాశాలుంటాయి.
* వికారం, వాంతులు తలనొప్పి, కళ్లు మసకబారడం, ఒక్కోసారి శాశ్వతంగా చూపు కోల్పోవడం, మూర్చ, కొన్ని సందర్భాల్లో కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.
* ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశాలుంటాయి.
అతిగా వాడినా నష్టమే
* ఎలాంటి శానిటైజర్లయినా అతిగా వాడితే ఇబ్బందేనని అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ హెచ్చరించింది.
* దీనిని రోజూ వాడుతుంటే చేతులు పొడిబారే అవకాశాలుంటాయి. పగుళ్లు ఏర్పడతాయి. దురద పుడుతుంది. మంట పెడుతుంది. కొన్నిసార్లు బొబ్బలు కూడా వస్తాయి.
* యాంటీబ్యాక్టీరియా పదార్థాలు ఎక్కువగా ఉన్న శానిటైజర్లను తరచూ వినియోగించినప్పుడు.. యాంటీ బయాటిక్స్‌కు నిరోధకత పెరిగే అవకాశముంటుంది. అంటే యాంటీ బయాటిక్స్ ఔషధాలను వాడినప్పుడు అవి సరిగా పనిచేయకపోవచ్చు.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
"ప్రపంచ ఆరోగ్య సంస్థ శానిటైజర్ల తయారీకి 24 రకాల పదార్థాలను సూచించింది. మన దగ్గర ఎక్కువగా మూణ్నాలుగు రకాలే వాడుతుంటారు. ఇథనాల్‌తో తయారు చేసినవే శ్రేయస్కరం. అనుమతులు కూడా వాటికే తీసుకుంటారు. మిథనాల్ తక్కువ ధరకు సులువుగా దొరుకుతుంది. వాసన కూడా తేడా ఉండదు. అందుకే కొన్ని సంస్థలు మిథైల్ ఆల్కహాల్‌తో శానిటైజర్లను తయారు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటన్నింటిపైనా నిఘా పెట్టాం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం."
-డాక్టర్ నవీన్‌కుమార్, సంయుక్త సంచాలకులు, ఔషధ నియంత్రణ సంస్థ
చేతులను మాయిశ్చరైజ్ చేయాలి
"సబ్బు, నీటితో కడుక్కోవడమే ఉత్తమం. శానిటైజర్ వాడాల్సి వస్తే రాత్రి పూట పడుకునే ముందు, చేతులకు తేమ పెంచే మాయిశ్చరైజర్ వాడాలి. సువాసనలు వెదజల్లే, గాఢమైన రంగులు కలిగిన శానిటైజర్ల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలి. పొరపాటున నోటికి తగిలితే.. విష ప్రభావానికి లోనయ్యే ప్రమాదముంది."
-డాక్టర్ పుట్టా శ్రీనివాస్, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు
ఇవీ చూడండి: నెహ్రూ జూపార్క్‌లో తెల్లపులి మృతి.. సీసీఎంబీకి రిపోర్టు!