ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆన్‌లైన్ ప్రవేశాలపై సలహాలు, సూచనల కోసం ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యాలు, అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పలు సందేహాలు వ్యక్తం చేశారు. తాము ఒక కళాశాలలో పిల్లల్ని చేర్పించాలనుకుంటామని, అక్కడ సీటు రాకపోతే ఎక్కడ చదివించాలని కొందరు ప్రశ్నించారు. పదో తరగతి పిల్లలకు ఆన్‌లైన్‌లో కళాశాలను ఎంచుకునే స్థాయి పరిజ్ఞానం ఉండదని, చదువుకోని తల్లిదండ్రులు ఉంటే విద్యార్థులను చేర్పించడం ఎలా? అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలలో కలిసి చదువుకున్న ఆడపిల్లలు కళాశాలలోనూ వారితోనే కలిసి చదువుకోవడానికి ఇష్టపడతారని, ఆన్‌లైన్ వల్ల తలో కళాశాలకు వెళ్లాల్సి వస్తే వారు మానసిక వ్యధకు గురవుతారని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తల్లి చెప్పారు. ఇంటికి సమీపంలోని కళాశాలలో చేర్పిద్దామనుకున్నామని, ఆన్‌లైన్లో అక్కడ సీటు రాకపోతే తమ పిల్లవాడు ఎక్కడికో వెళ్లాల్సి ఉంటుందని విశాఖపట్నానికి చెందిన గణేష్ అన్నారు. మార్కులు ఎక్కువ వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ మంచి కళాశాలల్లో సీట్లు వస్తాయని, చదువురాని వారందరికీ వేరొక వాటిలో ప్రవేశాలు కల్పిస్తారని.. ఇదేం పద్ధతని ప్రశ్నించారు. పదో తరగతిలో అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారని, ఇవి విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షించినవి కావని మరో విద్యార్థి తండ్రి పేర్కొన్నారు. అందువల్ల పదో తరగతి పరీక్షలు సాధారణ పద్ధతిలో జరిగే వరకు ఆన్‌లైన్ ప్రవేశాల విధానాన్ని వాయిదా వేయాలని కోరారు. తల్లిదండ్రుల ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానమిచ్చిన అధికారులు, మిగతా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.
సీట్లు మిగిలితే ఏం చేయాలి?
వృత్తి విద్యా కోర్సుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ప్రవేశాలు తీసుకుంటారని, రిజర్వేషన్ల కారణంగా ఇతర వర్గాలకు కేటాయించిన సీట్లు మిగిలిపోతే తామేం చేయాలని ఓ కళాశాల యజమాని ప్రశ్నించారు. మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన తర్వాత రెండో పర్యాయానికి పూర్తి మార్గదర్శకాలు ప్రకటిస్తామని అధికారులు సమాధానమిచ్చారు. కళాశాలలకు ఫీజులు నిర్ణయించకుండా ప్రవేశాలు నిర్వహిస్తే ఎలా? ముందు రుసుములు ఎంతో ప్రకటించాలని మరో యాజమాన్యం కోరింది. ఆన్‌లైన్ ప్రవేశాలపై అత్యధిక మంది విద్యార్థులకు అవగాహన లేదని, దీనిపై ప్రచారం నిర్వహించాలని పలువురు సూచించారు.
ఇదీ చదవండి: Jagananna Pacha Toranam: నేడు జగనన్న పచ్చతోరణం ప్రారంభం.. తొలిమొక్క నాటనున్న సీఎం