Cm Jagan launch Jagananna Palavelluva: పాడి రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'జగనన్న పాల వెల్లువ' కార్యక్రమం కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సీఎం జగన్ ప్రారంభించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడాది క్రితం అమూల్ ద్వారా పాల సేకరణ ప్రారంభించామని, ప్రస్తుతం 6 జిల్లాల్లో కార్యక్రమం కొనసాగుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇవాళ మరో ఆరు జిల్లాల్లో కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఈ పథకం ద్వారా పాలసేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. ఇదొక్క మంచి ఘట్టమన్నారు.
అమూల్ కంపెనీ కాదు.. సహకార సంస్థ
Cm Jagan On Amul: పలు కారణాలతో రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారులకు అన్యాయం జరుగుతుందని, ఈ పరిస్థితిని మార్చడానికే ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ధరల స్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి.. రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. అమూల్‌తో మాట్లాడి... వారిని రాష్ట్రానికి తీసుకువచ్చామని సీఎం తెలిపారు. అమూల్ అనేది కంపెనీ కాదని .. సహకార సంస్థ అని తెలిపారు. అమూల్ లాభాపేక్ష లేని సంస్థ అని, ఇక్కడ పాలు పోసే రైతులే యజమానులని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వచ్చే లాభాలను పాడి రైతులకే తిరిగి ఇస్తారని చెప్పారు. అమూల్ దగ్గర మంచి ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయన్న ముఖ్యమంత్రి జగన్ ... నేరుగా చాక్లెట్ల తయారీ చేసే వ్యవస్థ ఉందన్నారు. దేశంలోనే పాల ప్రాసెసింగ్‌లో నంబర్ 1 సంస్థగా పేరు గడించిందన్నారు. ప్రపంచంలోనే అమూల్ 8వ స్థానంలో ఉందని ప్రశంసించారు. ఎక్కడా కూడా మోసానికి తావులేకుండా పారదర్శకంగా పాలసేకరణ ఉంటోందన్నారు. సేకరించిన పాల వల్ల రైతులకు అదనంగా 10 కోట్ల రూపాయల మేలు జరిగిందన్నారు. రైతులకు అదనంగా రూ. లీటర్‌కు 20 రూపాయల పై చిలుకు లాభం వచ్చిందన్నారు.
వారికి ప్రతి లీటర్‌పై రూ. 50 పైసల బోనస్..
Jagananna Palavelluva scheme : గతంలో ఒక లీటరు మినరల్ వాటర్ ధర, లీటరు పాల ధర సమానంగా ఉండేదని, ఫలితంగా తామంతా నష్టపోతున్నట్లు రైతులు పాదయాత్ర సమయంలో తన వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సీఎం జగన్ గుర్తు చేశారు. అమూల్ రాకతో మార్కెట్లో పోటీ పెరిగిందని.. దీని వల్ల వ్యాపారులు మంచి ధరలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నిర్ణయించిన ధరకు లేక అంతకన్నా.. ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్న సీఎం... ఆర్థిక చైతన్యానికి ఈ పాల వెల్లువ కార్యక్రమం ఊతమిస్తోందన్నారు. ఏడాదిలో కనీసం 182 రోజులు పాలుపోసే మహిళా రైతులకు ఏడాది చివర్లో ప్రతి లీటర్‌పై 50 పైసలు బోనస్‌గా చెల్లిస్తున్నారని సీఎం వివరించారు. నాణ్యమైన దాణాను తక్కువ ధరకే సరఫరా చేస్తున్నారన్నారు. పాడి ఎక్కవగా ఉన్న గ్రామాలను ప్రభుత్వం గుర్తించిందని, ఆయా గ్రామాల్లో బీఎంసీ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనుబంధ గ్రామాల్లోనూ ఏంసీలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
అమూల్ సంస్థ పాల బిల్లులను 10 రోజుల్లోనే పాడిరైతుల ఖాతాల్లోకి జమచేస్తోందని , దీనివల్ల ఆర్థికంగా అక్కచెల్లెమ్మలకు మరింత మంచి జరుగుతుందన్నారు. సహకార రంగ వ్యవస్థ బాగుంటేనే రైతులు బాగుంటారన్నారు. మిగిలిన 7 జిల్లాల్లో కూడా త్వరలోనే పాలసేకరణ ప్రారంభం అవుతుందని సీఎం స్పష్టం చేశారు.
"అమూల్ ఒక కంపెనీ కాదు... పాలు పోసేవాళ్లే యజమానులు. లాభాలను కూడా రైతులకు ఇచ్చే గొప్ప సంస్థ అమూల్. అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే పాల సేకరణ చేస్తోంది. ప్రకాశం, చిత్తూరు, కడప, గుంటూరు, ప.గో.లో పాల సేకరణ జరుగుతోంది. పాలవెల్లువ ఇవాళ ఆరో జిల్లాలోకి ప్రవేశిస్తోంది. మిగిలిన 7 జిల్లాల్లోనూ త్వరలోనే పాలసేకరణ ప్రారంభమవుతుంది. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని పాలసేకరణ చేస్తున్నాం. పాల నుంచి చాక్లెట్ తయారుచేసే వ్యవస్థ అమూల్‌కు ఉంది. ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో అమూల్ సంస్థ ఉంది" - ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి:
'కడుపులో కొకైన్.. ఆమె అండర్వేర్లో గోల్డ్.. సబ్బు పెట్టెల్లో డ్రగ్స్!'