CM kcr Speech in Assembly Sessions: విద్యుత్ వినియోగాన్ని దేశాల ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన ఆయన, మరికొన్ని నెలల్లో భాజపాకు అధికారం దూరమవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. రైతుల పాలిట శాపంగా మారిన మోటార్లకు మీటర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఖరాఖండీగా తేల్చిచెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండో రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై కేసీఆర్ మాట్లాడారు.
జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 957 యూనిట్లయితే.. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,250 యూనిట్లు అని కేసీఆర్ అన్నారు. చిన్నదేశాల కంటే మనదేశంలోనే విద్యుత్ వినియోగం తక్కువ అని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తిలో భాజపా ప్రభుత్వం చెప్పేవన్నీ గోల్‌మాల్ గోవిందం మాటలే అని ఎద్దేవా చేశారు. సౌరశక్తి పేరుతో విద్యుత్ వ్యవస్థను బడాబాబులకు అప్పగించేదుకు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. తాను చెప్పిన విద్యుత్ లెక్కలు అబద్ధమని తేలితే క్షణంలో రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. చెత్తను వాడుకుని కూడా అద్భుతంగా విద్యుత్ తయారు చేయొచ్చు.. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తయితే మనకూ విద్యుత్ చౌకగా లభిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
మరి ఆ బకాయిలు ఇప్పించండి.. "ఏపీకి రూ.3వేల కోట్ల విద్యుత్ బకాయిలు.. మరో రూ.3వేల కోట్ల వడ్డీ కట్టాలని తెలంగాణకు కేంద్రం చెప్పింది. నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటామంటున్నారు. మరి ఏపీ నుంచి తెలంగాణకు రూ.17వేల కోట్లు రావాలి. కృష్ణపట్నం సహా అనేక రంగాల్లో తెలంగాణ వాటా ఉంది. మీరు చెబుతున్న రూ.6వేల కోట్లు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని కేంద్రం ఇప్పించాలి. 20 ఎకరాల రైతు నగరానికి వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి ఉండేది. తెరాస ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రైతుల బాధలు ఇప్పుడే తీరుతున్నాయి. మేం ఇచ్చే రైతుబంధు నిజమైన ఉద్దీపన కార్యక్రమం. ప్రస్తుతం 65 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. రాష్ట్రంలో కోటీ 30 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది.. తెలంగాణలో ఉచిత విద్యుత్ బంద్ చేయాలని చూస్తున్నారని" కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఆ బిల్లులు వెనక్కి తీసుకోవాలి.. "కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఇప్పుడు తెలంగాణపై పడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్‌ఈసీ రుణాలు ఆపేందుకు కుట్రలు చేస్తున్నారు. ఉదయ్ పథకంలో చేరాక అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇది పోరాటాలు, పౌరుషాల గడ్డ.. ఇక్కడ పిట్ట బెదిరింపులు పనిచేయవు. విద్యుత్ విషయంలో కేంద్రం బండారం బయటపెడతాం. మనం ఇచ్చే పింఛన్లు, రైతుబంధు గురించి కేంద్రమంత్రికి ఎందుకు? శీతాకాల సమావేశాలు 20 రోజులు జరిపి కేంద్రాన్ని ఎండగడతాం. 10 శాతం విదేశీ బొగ్గు విధిగా కొనాలని విశ్వగురు చెబుతున్నారు. రూ.4వేలకు వచ్చే సింగరేణి బొగ్గు వదిలి రూ.30వేలకు వచ్చే బొగ్గు కొనాలా? కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ విధానం వల్ల అంధకారంలోకి వెళ్తున్నాం. అనేక బిల్లులు తెచ్చారు.. జనం ఉద్యమించడంతో వెనక్కి తీసుకున్నారు. విద్యుత్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని కేసీఆర్ అన్నారు.
'విద్యుత్ బిల్లు వెనక్కి తీసుకోవాలని రేపు సభలో తీర్మానం. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని రేపు తీర్మానం. గురుకులాల్లో భోజనం, నాణ్యతపై సమీక్షిస్తా. వీఆర్ఏలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారు. అర్హులైన వీఆర్ఏలకు స్కేల్ ఇచ్చి వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తాం.
వీఆర్ఏల మిగతా సమస్యలు పరిష్కరిస్తాం.'-సీఎం కేసీఆర్
ఇవీ చదవండి: