Telangana Cabinet Meeting: రానున్న ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశమైంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక పద్దుపై భేటీలో చర్చించారు. రాబడులు, ఆదాయవ్యయాలు, బడ్జెట్ కేటాయింపులు, ఏడాది కాలంలో ప్రభుత్వ ప్రణాళికలు, ఆలోచనలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు వివరించారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. కేబినెట్ ఆమోదంతో రేపు ఉభయసభల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు.
గవర్నర్ ప్రసంగం లేకుండానే నేరుగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. మరోవైపు బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1200 మంది పోలీసులు బందోబస్తులో భాగంకానున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, తదితర అంశాలను మంత్రివర్గ సహచరులకు సీఎం వివరించారు. 2023 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి చివరి బడ్జెట్ అయినందున.. అనుసరించాల్సిన కార్యాచరణ, అమలు తీరుతెన్నులపై వివరించారు. గవర్నర్ ప్రసంగంలేకపోవడంపై.. తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేసిన అంశం చర్చించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: