తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు చురుగ్గా సాగుతోంది. సీఎం కేసీఆర్ నివాసగృహ వివరాల నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని నివాసం వద్దకు వచ్చిన గ్రామకార్యదర్శికి సాధారణ ప్రజల మాదిరే కేసీఆర్... నివాస గృహ వివరాలను స్వయంగా అందించారు. వాటిని అధికారులు యాప్‌లో నమోదు చేశారు.
ఆస్తులపై ప్రజలకు హక్కుతోపాటు భద్రత కల్పించేందుకు ప్రతి కుటుంబం స్థిరాస్తుల వివరాలు నమోదు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ఆస్తుల నమోదు... దేశంలోనే మొట్టమొదటి అతి పెద్ద ప్రయత్నమన్నారు. స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ భూముల తరహాలో వ్యవసాయేతర ఆస్తులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలంతా తమ స్థిరాస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.