CM KCR Comments on Lockdown: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే పరిస్థితులు లేవని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. మాస్క్ ధరించడం సహా కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా కొవిడ్‌ను నియంత్రించవచ్చన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదన్న అధికారులు... కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు వైద్యాధికారులు నివేదించారు.
నిబంధనలు పాటించాలి..
Corona cases in Telangana: ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్న సీఎం... అజాగ్రత్త పనికిరాదని, నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు. పని చేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్కులు ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కొవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నిరకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.
విద్యాసంస్థలకు సెలవులు..
Holidays for schools in Telangana: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండగ కోసం పాఠశాలలు, కొన్ని విద్యాసంస్థలకు ఈ నెల 11 నుంచి సెలవులు ప్రకటించారు. మరికొన్ని విద్యాసంస్థలు మూడు లేదా నాలుగు రోజుల సెలవులు ప్రకటించాయి. కొవిడ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అన్ని విద్యాసంస్థలకు ఎనిమిదో తేదీ నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
100 శాతం ఆక్సీజన్ పడకలుగా..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని దాదాపు 99 శాతం పడకలను ఇప్పటికే ఆక్సిజన్ పడకలుగా మార్చారని... మిగిలిన ఆ ఒక్క శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ పడకలుగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మెట్రిక్ టన్నుల నుంచి 324 మెట్రిక్ టన్నులకు పెంచినట్లు తెలిపిన సీఎం... దాన్ని500 మెట్రిక్ టన్నుల వరకు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లు 20 లక్షల నుంచి కోటి వరకు... ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని స్పష్టం చేశారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు వెంటనే అందుబాటులో ఉండేలా చూడాలన్న సీఎం... ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునేలా విధివిధానాలను రూపొందించాలని చెప్పారు.
వైద్యసేవలు మెరుగుపరచాలి..
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన వైద్యులు, పడకలు, మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి తెలిపారు. కొత్తగా నిర్మాణమైన సమీకృత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్నందున ఖాళీ అయిన పాత కలెక్టరేట్, ఆయా శాఖల భవనాలు, స్థలాలను విద్యా, వైద్యశాఖల అవసరాల కోసం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డయాలిసిస్ సేవలను మరింత విస్తరించాలన్న ముఖ్యమంత్రి... ప్రస్తుతం పది వేల మంది కిడ్నీ రోగులకు సేవలు అందుతున్న నేపథ్యంలో డయాలిసిస్ మిషన్లను మరిన్ని పెంచాలని చెప్పారు.
నగరపాలికలకు బస్తీ దవాఖానాలు..
హైదరాబాద్‌లో విజయవంతంగా సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికలకు విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ వాటి సంఖ్యను పెంచాలని ఆదేశించారు. కంటోన్మెంట్ జోన్ పరిధిలో వార్డుకు ఒకటి చొప్పున ఆరు బస్తీదవాఖానాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. రసూల్పురలో రెండు... ఎల్బీనగర్, శేర్ లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజిగిరిలో ఒక్కొక్క బస్తీ దవాఖానా అదనంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. శివారు నగర, పురపాలికలైన జల్‌పల్లి, మీర్‌పేట్, ఫీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌గర్, నిజాంపేటలోనూ ఒక్కొక్కటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పట్టణాల్లోనూ బస్తీ దవాఖానాలు..
హైదరాబాద్ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఇతర పట్టణాల్లోనూ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. వరంగల్ కార్పోరేషన్ పరిధిలో నాలుగు, నిజామాబాద్ లో మూడు, మహబూబ్ నగర్, నల్గొండ, రామగుండం, ఖమ్మం, కరీంనగర్ లో రెండు చొప్పున బస్తీ దవాఖానాలు నెలకొల్పాలని ఆదేశించారు. జగిత్యాల, సూర్యాపేట, సిద్ధిపేట, మిర్యాలగూడ, కొత్తగూడెం, పాల్వంచ, నిర్మల్, మంచిర్యాల, తాండూర్, వికారాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్, గద్వాల్, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్, బొల్లారం, అమీన్‌పూర్, గజ్వేల్, మెదక్ పట్టణాల్లో ఒక్కో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: