ముఖ్యమంత్రి జగన్ మంగళవారం దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశముంది. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి నుంచి బయల్దేరనున్న జగన్...సాయంత్రం 5గంటలకు దిల్లీకి చేరుకోనున్నారు. వెంటనే రాత్రిలోపు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నట్టు ఏపీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్షవర్ధన్‌ను కలవనున్న జగన్... రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం బకాయిలు, కొవిడ్ పోరులో అదనపు నిధుల కోసం విజ్ఞప్తి చేయనున్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు రాజకీయాంశాలపై చర్చ జరిగే అవకాశమున్నట్లు సమాచారం. పార్లమెంట్‌లో జరుగుతున్న పరిణామాలతో పాటు... రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో సీఎం వివరణ ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
దిల్లీ నుంచి తిరుమలకు
23వ తేదీ ఉదయం దిల్లీ నుంచే నేరుగా సీఎం జగన్ తిరుమల వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం గం.3.50లకు రేణిగుంట చేరుకుని సాయంత్రం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం గం.6.20 నిమిషాలకు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 24వ తేదీ ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇదీ చదవండి : 'ఏపీ పోలీస్ సేవ' యాప్ ఆవిష్కరించిన సీఎం జగన్