రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రేపు దిల్లీ వెళ్లనున్నారు. మద్యాహ్నం 1 గంటకు మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే ఆయన నేరుగా విజయవాడ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్తారు. రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోదీకి జగన్ వివరించే అవకాశం ఉంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ అంశాలతో పాటు కౌన్సిల్ రద్దు వ్యవహారంపైనా ప్రధానికి వివరించనున్నట్టు తెలుస్తోంది.
శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంటులోనూ ఆమోదింపచేసే విధంగా చూడాలంటూ.. సీఎం జగన్ ప్రధానిని కోరవచ్చని అధికార వర్గాలంటున్నాయి. పాలనాపరమైన వ్యవహారాలను విశాఖకు, హైకోర్టును కర్నూలుకు తరలించే అంశాలను.. ప్రధానితో చర్చించే వీలుంది. ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ అవసరాన్నీ ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ చర్చించే అవకాశముంది.
అటు పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరుతో పాటు రెవెన్యూ లోటు, బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి ఎక్కువ నిధులు మంజూరు చేసే విషయంపైనా.. సీఎం చర్చించనున్నట్టు తెలుస్తోంది.