ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది నియామక ప్రక్రియ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకునేందుకు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నూతన కార్పోరేషన్ కార్యకలాపాలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. సీఎస్ నీలం సాహ్నీ సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం నియామక పత్రాలు అందించారు.
పారదర్శకతే లక్ష్యం
కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్, నియామకాల్లో పూర్తి పారదర్శదత తీసుకురావడమే లక్ష్యంగా కార్పోరేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఎవరూ దళారులను ఆశ్రయించడం సహా లంచాలు, కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నియమించిన 50,449 మంది సిబ్బందికి ఆప్కోస్ ద్వారా నియామక పత్రాలు ఇస్తామని సీఎం చెప్పారు. గతంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అధికార పార్టీ నేతల అనుచరుల చేతుల్లో ఉండేవన్న సీఎం.. వారి జేబులు నింపేందుకే బాగా ఉపయోగపడేవన్నారు. తక్కువ మందిని నియమించి ఎక్కువ మందితో పనిచేయిస్తున్నట్లు చూపించి.. ప్రభుత్వ నిధులు కాజేసేవారని విమర్శించారు.
50 శాతం వారికే
రాష్ట్రంలో 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇస్తామని.. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించామని అన్నారు. ఉద్యోగుల వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని సీఎం తెలిపారు. లంచాలు, కమీషన్ లేకుండా ఆప్కోస్ ద్వారా ప్రతినెలా 1న పూర్తి వేతనం ఉద్యోగికి అందిస్తామని అన్నారు.
కలెక్టర్లే ఛైర్మన్లు
రాబోయే రోజుల్లో మిగిలిన విభాగాలు ఆప్కోస్తో అనుసంధానం చేసి అవసరమైన మేరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. జిల్లాల్లో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న కలెక్టర్లు ఉద్యోగుల నియామక ప్రక్రియ చేపడతారని.. ఇంఛార్జీ మంత్రులు రిజర్వేషన్లు అమలు విషయాన్ని పర్యవేక్షిస్తారని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం సూచించారు.
పనితీరే ఆధారం..
ఔట్ సోర్సింగ్ బాధ్యతగా పని చేయాలని సీఎం జగన్ సూచించారు. ఉద్యోగులు పనిచేసే విధానం బట్టి ఉద్యోగ భద్రత ఆధారపడి ఉంటుందన్న సీఎం.. కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ప్రతిఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఉద్యోగులకు సంబంధించి ఈఎస్ఐ, పీఎఫ్ క్రమం తప్పకుండా చెల్లిస్తామన్నారు.
ఇదీ చూడండి..
సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్