CM Jagan: పాలకుల్లో నిబద్ధత, విశ్వసనీయత ఉండాలని, అప్పుడే పాలనలో మార్పు కనిపిస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే పేదల్ని వెతుక్కుంటూ వారి తలుపు తడుతున్నాయన్నారు. సంక్షేమ పథకాల అమల్లో కులం, మతం, పార్టీ, వర్గం, రాజకీయాలు అని చూడటం లేదని, చివరకు గత ఎన్నికల్లో తమకు ఓటు వేశారా.. లేదా అన్నదీ చూడకుండా అర్హులందరికీ పథకం అందేలా చేస్తున్నామని ఆయన తెలిపారు.
అందుకే గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి లబ్ధిదారుల సంఖ్యలో తేడా లక్షల్లో ఉందన్నారు. అర్హత ఉండి గతంలో పథకాలు అందని 3.40 లక్షల మంది ఖాతాల్లో రూ.137 కోట్లు బటన్ నొక్కి జమచేసే కార్యక్రమాన్ని ఆయన మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించారు. ఆ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... 12 పథకాల లబ్ధిదారులకు ఆ మొత్తాన్ని జమచేస్తున్నట్టు చెప్పారు. కొత్తగా 3.10 లక్షల మందికి పింఛను, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామని, దానివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.935 కోట్లు అదనంగా వ్యయమవుతున్నా, అర్హులైన ఏ ఒక్కరూ మిగిలిపోరాదన్న ఉద్దేశంతో వాటిని అందజేస్తున్నామని తెలిపారు.
గతంలో ఎలా ఎగ్గొట్టాలా అని చూసేవారు: గత ప్రభుత్వం పేదలకు పథకాలు ఎలా ఎగ్గొట్టాలా? అని చూసేదని సీఎం పేర్కొన్నారు. ‘అప్పట్లో ఇన్ని పథకాల్లేవు. ఇచ్చే అరకొర పథకాల్లోనూ ఎలా కత్తిరించాలా? అని చూసేవారు. గత పాలనకు, మన పాలనకు తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. లబ్ధిదారులకు బ్యాంకుల్లో డబ్బు కూడా... వాటిని బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ఎన్‌కంబర్డ్ ఖాతాల్లో వేస్తున్నాం. సంక్షేమ క్యాలెండర్‌లో ఇచ్చిన షెడ్యూలును ఎక్కడా తప్పకుండా అమలు చేస్తున్నాం. ఇలా దేశంలో ఇంకెక్కడా లేదు’ అన్నారు.
జగన్ వల్లే బతికి ఉన్నామని చెబుతున్నారు: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తాము ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు... జగన్ వల్లే బతికున్నామని ప్రతి అవ్వా, తాత, మనవడు చెబుతున్నారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. ‘బడుగు, బలహీన, దళితవర్గాల గుండెతడి తెలిసిన వ్యక్తిగా సీఎం ఇంత చక్కని పాలన అందిస్తున్నారు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడం చారిత్రక అవసరం. రాష్ట్రానికి ఆయన శాశ్వత ముఖ్యమంత్రిగా, మరో రెండు దశాబ్దాలపాటు చక్కని పాలన, సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలి’ అని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
కలెక్టర్లు లేకపోవడంపై సీఎం అసహనం: సీఎం జగన్, మంత్రులు, సీఎస్ సమీర్‌శర్మ తదితరులంతా వచ్చి కూర్చున్నాక వార్డు, గ్రామ సచివాలయాల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అప్పటికీ కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు రాలేదు. కలెక్టర్ల కుర్చీలు ఖాళీగా కనిపిస్తుండటంతో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ‘కలెక్టర్లందర్నీ పిలిపించండి. స్క్రీన్ మీద అన్ని ఖాళీలు పెట్టుకుని ఎలా చేస్తున్నారు... వాళ్లందర్నీ లైన్‌లోకి తీసుకోండి’ అని ఆయన ఆదేశించారు. ‘కలెక్టర్లందరూ వెంటనే జాయినవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రోగ్రాం ఇప్పటికే స్టార్టయింది. సీఎం ఇక్కడ ఉన్నారు. కలెక్టర్లు లేనిచోట వెంటనే వారిని పిలవండి’ అని అజయ్‌జైన్ చెప్పి, అందర్నీ పిలిపించారు.
రామాయపట్నం పోర్టుకు నేడు సీఎం శంకుస్థాపన: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.40కి రామాయపట్నం చేరుకుంటారు. 11 నుంచి 12.30 గంటల మధ్య రామాయపట్నం పోర్టు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడి నుంచి బయల్దేరి 2 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
ఇవీ చదవండి: వ్యవసాయ బోర్ కనిపిస్తే చాలు... మీటర్ బిగించేయడమే
లారీతో ఢీకొట్టి డీఎస్పీ దారుణ హత్య.. రిటైర్మెంట్కు ముందే.. మైనింగ్ మాఫియా పనే!