రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల పరిధిలో వ్యవసాయ మార్కెటింగ్ సహా ఆహార శుద్ధి రంగాలను తీసుకువచ్చేలా.. మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు.. ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇందుకోసం 10వేల 235 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తామన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాలు, ఆహారశుద్ధి రంగంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. 2021లో వీటిని ఆరంభించి ఏడాదిలోగా పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో భాగంగా.. గోదాములు, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, సేకరణ కేంద్రాలు, శీతల గదులు, ప్రైమరీ ప్రాససింగ్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు, ఆక్వా ఇన్‌ఫ్రా, పశుసంవర్ధక శాఖకు.. అవసరమైన మౌలిక సదుపాయలు ఏర్పాటు చేయాలని అదేశించారు. జనతాబజార్లు, ఇ– మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను ఇవ్వటంతో పాటు సకాలంలోనే రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సూచించారు.
సేంద్రియ, సహజ పద్ధతులకు పెద్దపీట వేసేలా సంబంధిత ఉత్పత్తులను ఆర్బీకేల పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఏలూరు ఘటనలను దృష్టిలో ఉంచుకుని సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలన్నారు. బయోపెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ తయారు చేసే యూనిట్లను గ్రామ స్థాయిలో ప్రోత్సహించాలని సూచించారు. విత్తనం నుంచి విక్రయం వరకూ అనే నినాదం రైతు భరోసా కేంద్రాల ప్రధాన విధి కావాలని ఆదేశించారు. 212 కోట్లతో నాడు – నేడు కింద పనులు చేపట్టాలని.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో 10వేల641 ఆర్బీకేలతోపాటు కొత్తగా 125 అదనపు అర్బన్ ఆర్బీకేలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: దేశంలో కళ తప్పిన నూతన సంవత్సర వేడుకలు