వైఎస్‌ఆర్ జనతా బజార్ల ప్రతిపాదనలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 11 వేలకు పైగా గ్రామసచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయన్న సీఎం... వీటిలో వైఎస్‌ఆర్ జనతా బజార్ల ఏర్పాటుకు ప్రయత్నించాలని సూచించారు. వార్డు సచివాలయాల పక్కన కూడా జనతా బజార్లు రావాలన్న ముఖ్యమంత్రి... మండల కేంద్రాల్లో పెద్దస్థాయిలో జనతా బజార్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. దాదాపు 22 వేల జనతా బజార్లతో పెద్ద నెట్‌వర్క్ ఏర్పడుతుందని వివరించారు.
జనతా బజార్లలో శీతలీకరణ యంత్రాలు పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పాలు, పండ్లు, కూరగాయలు నిల్వచేసి విక్రయానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. జనతా బజార్ల వద్ద మినీ ట్రక్కులు, పికప్ వ్యాన్లు ఉంచాలని చెప్పారు. జనతా బజార్లకు సంబంధించి మ్యాపింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా కారణంగా రైతుబజార్లు, మార్కెట్లు వికేంద్రీకరించారన్న సీఎం జగన్... ఈ లొకేషన్లలో జనతా బజార్లు వచ్చేలా అధికారులు చూడాలన్నారు.
జనతా బజార్ల నిర్వహణ స్వయంసహాయ సంఘాలకు అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు ఇది మేలు చేస్తుందని అధికారులకు వివరించారు. దీనివల్ల రైతులకు మార్కెటింగ్ సమస్యలూ తొలగిపోతాయన్న సీఎం... సక్రమంగా చేస్తే రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు. వైఎస్‌ఆర్ జనతా బజార్ల ప్రాజెక్టుకు ఐఏఎస్ అధికారిని నియమించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండీ... పాలనా విభాగాల్లో కొత్త శాఖ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ