సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్..... మొదటి దశ ప్రాధాన్యత ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం, నెల్లూరు, సంగం ఆనకట్టలు, వెలిగొండ, వంశధార, అవుకు టన్నెల్ తదితర ప్రాజెక్టుల పనులు జరుగుతున్న తీరుపై నిశితంగా సమీక్షించారు. సకాలంలో వాటిని పూర్తి చేయాలని అధికారులును ఆదేశించిన ముఖ్యమంత్రి... సహాయ, పునరావాస కార్యక్రమాలపైనా చర్చించారు. ఫిబ్రవరి 10 నాటికి పోలవరం స్పిల్ వే రోడ్ పూర్తి చేస్తామని..... ఏప్రిల్ నాటికి రేడియల్ గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. అప్రోచ్ ఛానెల్ మే నాటికి పూర్తవుతుందన్నారు. డిజైన్ల అనుమతులు ఆలస్యం కాకూడదని..... వీటి కోసం ప్రత్యేకించి ఓ అధికారిని నియమించాలన్నారు. వచ్చే వర్షాకాలంలోగా కాఫర్ డ్యాం పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించగా... ఎవరూ ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నెల్లూరు బ్యారేజీ సివిల్ వర్క్స్ పూర్తయ్యాయని... మార్చి 31 లోగా గేట్ల బిగింపు పూర్తి చేసి ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. సంగం బ్యారేజీ గేట్ల బిగింపు పనులు రెండు వారాల్లో పూర్తవుతాయన్నారు. అవుకు టన్నెల్‌లో 134 మీటర్ల తవ్వకం పనుల్లో..... వర్షాలు, మృత్తికా నాణ్యత లోపంతో సమస్యలు వచ్చాయని వాటిని అధిగమించి జులై నాటికి పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. వెలిగొండలో మొదటి టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయ్యాయని... ఏప్రిల్ నుంచి రెండోదాని పనులు ప్రారంభిస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్ నీటినిల్వకు సిద్ధం చేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. కాల్వల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు.
వంశధార ప్రాజెక్టును జులైలో ప్రారంభించేలా 3 ప్యాకేజీల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. వంశధార-నాగావళి అనుసంధానం ఈ జూన్‌కి... తోటపల్లి పెండింగ్ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తిచేసి... గజపతినగరం బ్రాంచి కెనాల్ కింద 15వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టు న్యాయపరమైన వివాదాలపై దృష్టిపెడతామని..... వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దాన్ని పూర్తి చేస్తామన్నారు. రెండో విడత ప్రాధాన్య ప్రాజెక్టులతో కార్యాచరణ తయారు చేయాలని సీఎం జగన్... అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రాయలసీమ, పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టులకు.. ఆర్థిక సంస్థలతో సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని అధికారులు తెలిపారు. కృష్ణా కొల్లేరు సెలైనటీ మిటిగేషన్ ప్రాజెక్టు, ఏపీ స్టేట్ వాటర్ సెక్యూరిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు సంబంధించిన ఎస్.పీ.వీలపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను సీఎం సమీక్షించారు.
ఇదీ చదవండి
ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ