రాష్ట్రంలోని పాఠశాలలను అభివృద్ధి చేయటంపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టారు. ప్రతి మండలానికీ జూనియర్ కాలేజీ ఉండాలని ఉన్నతాధికారులతో సమీక్షలో ఆదేశించారు. ఆ మేరకు భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. ఉన్నత పాఠశాలలను క్రమ పద్ధతిలో స్థాయి పెంచుతూ పోవాలని దిశానిర్దేశం చేశారు. జూనియర్ కళాశాల స్థాయికి వీటిని తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
నాడు- నేడు కార్యక్రమం...
నాడు - నేడు కింద 44,512 పాఠశాలలను ప్రభుత్వం బాగు చేయనుంది. మొదటి విడతలో 15410 పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా 9 రకాల కనీస వసతులను కల్పించేలా ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి పాఠశాలలో 9 రకాల పనులు తప్పనిసరిగా పూర్తి కావాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మార్చి 14, 2020 నాటికి నాడు - నేడు కింద తొలి దశలో చేపట్టిన పనులు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో..
వచ్చే ఏడాది నుంచి 1-9 వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలోనే బోధన అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం 70 వేల మందికి ఆంగ్ల బోధనలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
ప్రతి ఏడాది జనవరిలోనే పరీక్షలు...
విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయ బృందాన్ని ఉంచడానికి కసరత్తు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రతి ఏడాది జనవరిలో పూర్తి చేయాలని చెప్పారు. ఏ శాఖ ఏ పరీక్షలు పెట్టాలన్నా జనవరిలో నిర్వహించేలా చూడాలని సూచించారు. పర్యావరణం, వాతావరణం మార్పులు, రహదారి భద్రతపై పాఠ్యాంశాలు పొందుపర్చాలని పేర్కొన్నారు. ప్రయివేటు కళాశాలలకు అనుమతి ఇవ్వడం లేదన్నది అవాస్తవమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాకపోతే అక్కడ సరైన మౌలిక సదుపాయాలు, ఉన్నాయా? లేదా? అన్నది చూస్తున్నామని తెలిపారు. కనీస ప్రమాణాలు, వసతులు లేకుండా ఏ విద్యా సంస్థ అయినా ఉండటం సరికాదని వ్యాఖ్యానించారు.