‘‘భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారి వచ్చినా ఎదుర్కొనేలా ఆస్పత్రులను సిద్ధం చేయాలి. రాష్ట్రంలో 50 పడకలకంటే ఎక్కువున్న అన్ని ఆస్పత్రుల్లో రానున్న నాలుగు నెలల్లోనే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్సకు ఐసీయూ పడకలు సిద్ధం చేయాలి. గ్లోబల్ టెండర్ల ద్వారా వీలైనన్ని ఎక్కువ టీకాలు సేకరించాలి’’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు కొవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో జగన్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే....
* వంద టన్నుల సామర్థ్యంతో ఎవరైనా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేస్తే 20% రాయితీ. ముందుగానే ఇన్సెంటివ్‌లు ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండుకు తగ్గట్టు ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలి. (ఆక్సిజన్ తయారీలో వాడే జియోనైటు ఉత్పత్తి పరిశ్రమ త్వరలో కడపలో ఏర్పాటవుతోందని అధికారులు సీఎంకు చెప్పారు)
* బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆక్సిజన్ కోసం వినియోగించే నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలన్న సమాచారం వస్తోంది. ఆక్సిజన్ సరఫరాకు నిర్ణీత ప్రమాణాలున్న పైపులు, మాస్కులనే వినియోగించండి.
* వ్యాక్సినేషన్ కోసం వీలైనంత త్వరగా గ్లోబల్ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి. రెండు కోట్ల మందికి సరిపడా నాలుగు కోట్ల డోసులు ఇప్పుడు సేకరిస్తున్నాం. వీలుంటే ఇంకా ఎక్కువ వచ్చేలా చూడండి. తొలుత 45 ఏళ్ల పైబడిన వారికి రెండు డోసులిచ్చి, ఆ తర్వాత 18 ఏళ్ల పైబడిన వారికి రెండు డోసులివ్వాలి.
* కొవిడ్ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం బాగుండాలి. మంచి ఆహారం ఇవ్వాలి. చిన్నచిన్న విషయాల్లోనూ ఎలాంటి కొరత లేకుండా చూడాలి. అధిక ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి. రెమ్‌డెసివిర్ అక్రమాలకు పాల్పడ్డ వారిపైనా చర్యలు అవసరం.
ఆక్సిజన్ కోసం త్వరలో మరో రైలు
ఆక్సిజన్ రవాణాకు రాష్ట్రంలో ప్రస్తుతం రెండు రైళ్లు నడుస్తున్నాయని, వారంలో మరో రైలు ప్రారంభమవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. దీంతోపాటు భువనేశ్వర్‌కు ప్రతిరోజూ నాలుగు ట్యాంకర్లు వాయుమార్గంలో పంపుతున్నామన్నారు. అధికారులు ముఖ్యమంత్రికి ఏం చెప్పారంటే...
* దేశంలో ఎక్కడ ఆక్సిజన్ కేటాయిచినా తీసుకురాగలుగుతున్నాం. ఆక్సిజన్ వృథా కాకుండా ఆడిట్ చేస్తున్నాం. తొమ్మిది పీఎస్‌యూ యూనిట్లను పునరుద్ధరించడంతో 52.75 టన్నుల ఉత్పత్తి వచ్చింది.
* కొవిడ్ వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్లకు ప్రీ బిడ్ సమావేశం 20న నిర్వహించాం. టెండర్లకు మంచి స్పందన వస్తోంది. జూన్ 3న బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ.
* రాష్ట్రంలో ప్రస్తుతం 621 కొవిడ్ ఆస్పత్రుల్లోని 45,611 పడకల్లో 38,763 నిండాయి. వాటిలో 28,189 ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తున్నవే. సమావేశంలో మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ఉన్నతాధికారులు కరికాల వలనన్, అనిల్ కుమార్ సింఘాల్, ఎం.టి.కృష్ణబాబు, ఎం.రవిచంద్ర, కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రానికి వంద ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన డబ్ల్యూహెచ్‌వో