రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తూనే ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు అందుతున్నాయో లేదో చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రైతు బజార్లు, నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు ఉన్నాయా? లేవా ? మ్యాపింగ్ చేయాలని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19పై సమీక్ష చేసిన సీఎం జగన్... ప్రజల సంఖ్యకు తగిన రీతిలో దుకాణాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
అది తర్వాత చూద్దాం...
నిత్యావసరాలు లభ్యమవుతున్న సమయాన్ని తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. ఉదయం 6 గంటల నుంచి ఒంటిగంట వరకూ ఉన్న సమయాన్ని తగ్గించాలంటూ కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి... ముందు నిత్యవసరాలు ప్రజల అవసరాలకు అనుగణంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనను పరిశీలించాలని సూచించారు.
వారికి మాత్రమే అనుమతి...
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవారికి సరిహద్దుల్లోనే వసతులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడిన వారికి మాత్రమే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తేల్చిచెప్పారు. సరిహద్దులో ఏర్పాటు చేసే క్వారంటైన్ వసతిలో భోజనం ఉండేలా చూడాలని... అందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని స్పష్టం చేశారు.
స్థితిగతులను తెలుసుకోండి...
రాష్ట్రం వెలుపల ఏపీకి చెందిన కూలీలు, కార్మికుల స్థితిగతులను తెలుసుకుని వారికి సంబంధించిన వివరాలను ఆయా స్థానిక ప్రభుత్వాలకు తెలియజేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీనిపై తక్షణం స్పందించేందుకు రాష్ట్రస్థాయిలో ఒక ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యల్లో భాగంగా... ఆస్పత్రుల్లో పని చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే వైద్యులను గుర్తించి వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
వారి సేవల్ని వినియోగించుకోవాలి...
విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 ఇళ్ల తాలూకు పరిస్థితులను ఎప్పటికప్పుడు నమోదు చేసేలా వాలంటీర్లు, ఆశావర్కర్ల సేవల్ని వినియోగించుకోవాలని చెప్పారు. నిత్యావసర వస్తువుల వాహనాలను నిలిపేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయని... అలాగే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన సమస్యలపైనా దృష్టిపెట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాజిక దూరం పాటించేలా, కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని ఆదేశించారు.
ఇదీ చదవండీ... ఎవరూ రావొద్దని తాడు కట్టారు..అదే యమపాశమైంది