ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వ్యవహారంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న వేళ సీఎం జగన్ స్పందించారు. ఆ కిట్లు ఎక్కడున్నా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని స్పష్టం చేశారు. కరోనా నివారణపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు.
'ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అనుమతిచ్చిన సంస్థకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో కిట్‌ను రూ.795కు కొనుగోలు చేయాలని ఐసీఎంఆర్ పేర్కొంది. అయినా రూ.65 తక్కువకు ఏపీ ప్రభుత్వం ఆర్డర్ ప్లేస్ చేసింది. ఒకవేళ తక్కువ ఖర్చుకు ఏ రాష్ట్రానికైనా అమ్మితే ఆ ధర ప్రకారమే చెల్లిస్తామని సదరు ఆర్డర్‌లోనే షరతు పెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినపుడు ఆ కిట్లు బయట దేశంలో తయారయ్యాయి. భారత్‌లో తయారీకి అదే సంస్థకు ఐసీఎంఆర్ అనుమతి ఇవ్వటంతో కిట్ల ధర తగ్గింది. ప్రస్తుతం 25 శాతం మాత్రమే చెల్లింపులు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన షరతు వల్ల ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధర తగ్గించేందుకు తయారీ సంస్థ అంగీకరించింది' అని సీఎం జగన్ వివరించారు. చాలా నిజాయతీగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఆర్డర్ చేశామని.. ప్రజాధనాన్ని కాపాడే ఆలోచన చేసిన వైద్యఆరోగ్యశాఖ అధికారులను అభినందిస్తున్నట్లు సీఎం చెప్పారు.
ర్యాపిడ్ కిట్లను రూ.337కే కొనుగోలు చేస్తున్నామంటూ ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టి.ఎస్.సింగ్‌దేవ్ ఇటీవల ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఛత్తీస్‌గఢ్ కంటే రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరకు ర్యాపిడ్ కిట్లు కొనుగోలు చేస్తోందని ఆరోపించాయి. కరోనా కిట్లలో కూడా కమీషన్ కొట్టారా? అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కిట్ల ధర ఎంతో ప్రజలకు చెప్పి పారదర్శకత నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి