సీఆర్‌పీసీ ప్రకారం ఒక నేరారోపణపై రెండు విచారణలను కొనసాగించడానికి వీల్లేదని భారతి సిమెంట్స్ తరఫు న్యాయవాది జ్ఞానేంద్రకుమార్ సీబీఐ కోర్టుకు నివేదించారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో నమోదైన కేసుల్లో సీబీఐ కేసు అనంతరం ఈడీ కేసు విచారించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు విచారించారు. సీబీఐ కేసు విచారణ అనంతరమే ఈడీ కేసు విచారణ చేపట్టాల్సి ఉందని న్యాయవాది జ్ఞానేంద్రకుమార్ ప్రస్తావించారు. సాయిరెడ్డి, జగతి తరఫు న్యాయవాదుల వాదనలనే అన్వయించుకుంటున్నట్లు మరో నిందితుడైన ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్య తరఫు న్యాయవాది చెప్పారు.
మరో మాజీ ఐఏఎస్ అధికారి శామ్యూల్ తరఫు న్యాయవాది గడువు కోరడంతో విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో రాంకీ, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, వాన్‌పిక్ కేసుల్లో విచారణ గురువారం జరగనుంది. ఓఎంసీ కేసులో మాజీ ఐఏఎస్ కృపానందం, గాలి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్ వేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ డిసెంబరు 1కి వాయిదా పడింది.
ఇదీ చదవండి:
రాజధాని భూ కొనుగోలు దర్యాప్తుపై హైకోర్టు స్టే యథాతథం: సుప్రీం