మైనారిటీల ఉప ప్రణాళిక కోసం తగిన చర్యలు తీసుకోవాలని, ఇది అమలైతే నిధులు మరింత పెరుగుతాయని సీఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మైనారిటీ సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వక్ఫ్ భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. వీటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆయా ఆస్తుల చుట్టూ ప్రహరీలను నిర్మించాలి. ఉపాధిహామీ పథకం ద్వారా వీటిని నిర్మించే అంశాన్ని పరిశీలించాలి. ఆ భూముల రక్షణకు హోంగార్డులను నియమించేలా చూడాలి. భూములను ఏ మేరకు వినియోగించుకోగలమనే దానిపై నిపుణుల సలహాలను తీసుకోండి. సమగ్ర భూసర్వేతోపాటు వక్ఫ్‌ఆస్తులను సర్వే చేయాలి’ అని ఆదేశించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
* మైనారిటీల అవసరాలకు తగినట్టు కొత్త శ్మశానవాటికలు ఏర్పాటుచేయాలి. ఈ ఏడాది దీన్ని ప్రాధాన్య అంశంగా తీసుకోవాలి.
* నాడు-నేడు తరహాలోనే కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయ పనులు ప్రాధాన్య ప్రాజెక్టు కింద చేపట్టాలి.
* షాదీఖానాల నిర్వహణను మైనారిటీ సంక్షేమశాఖకు బదిలీ చేయండి.
సకాలంలో ఇమామ్, మౌజమ్, పాస్టర్ల గౌరవ వేతనాలు
* ఇమామ్‌లు, మౌజమ్‌లు, పాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాలు చెల్లించాలి. ఇందు కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలి.
* గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో హజ్ నిర్మాణానికి అధికారుల ప్రతిపాదనకు సీఎం అంగీకారం. హజ్, వక్ఫ్ కమిటీల ఏర్పాటు త్వరగా పూర్తిచేయాలి.
* గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం మొదలై ఆర్ధాంతరంగా ఆగిన క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తి చేయాలి.
* మైనారిటీ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం రాష్ట్రంలో ఏర్పాటవుతున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి: