మురుగునీటిని శుద్ధి చేశాకే కృష్ణా, గోదావరి నదుల్లోకి, పంట కాల్వల్లోకి వదలాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఎక్కడెక్కడ శుద్ధి చేసే సదుపాయాలు ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ చేపట్టాలో నివేదిక సమర్పించాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలో మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మితో కలిసి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు.
'అన్ని నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే పారిశుద్ధ్య కార్మికుల జీతాన్ని రూ. 12,000 నుంచి రూ. 18,000కు పెంచాం. చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ వారిని పట్టించుకోలేదు’ అని సీఎం విమర్శించారు. ‘టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలి. ఈలోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి' అని అధికారులను ఆదేశించారు. గత మూడేళ్లలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల కోసం రూ. 4,500 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ. 6,000 కోట్లు వెచ్చిస్తున్నామని అధికారులు వివరించారు.
రోడ్లను అందంగా తీర్చిదిద్దాలి
‘గన్నవరం నుంచి విజయవాడ, భోగాపురం నుంచి విశాఖపట్నం వెళ్లే రహదారులను అందంగా తీర్చిదిద్దాలి. ఈ పనులు నగర అందాలను పెంచేలా ఉండాలి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను ఇదేరకంగా అభివృద్ధి చేయాలి. విజయవాడలో కాల్వల సుందరీకరణపై నివేదిక ఇవ్వాలి. పంట కాల్వల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలి. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి. కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి’ అని సీఎం సూచించారు.
ప్రతి నియోజకవర్గంలో స్మార్ట్ టౌన్‌షిప్
‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రారంభం కావాలి. నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు, రోడ్లపై వంతెనల (ఆర్వోబీ) పనులను సత్వరమే పూర్తి చేయాలి. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలి. ప్రయోగాత్మకంగా పలు పట్టణాల్లో ప్రారంభించిన మహిళా మార్ట్‌లు ఎలా పని చేస్తున్నాయో సమీక్షించాలి’ అని జగన్ ఆదేశించారు.
రోడ్లపై గుంతల్లేకుండా చూస్తాం
వచ్చే నెల 15 నాటికి నగరాలు, పట్టణాల్లో రోడ్లపై గుంతలు లేకుండా పనులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే 51.92% పనులు పూర్తయ్యాయని అన్నారు. 16,762 రోడ్లకు సంబంధించి 4,396 కిలోమీటర్ల పనుల కోసం రూ. 1,826.22 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రాజధానిలో తుది దశకు క్వార్టర్లు
రాజధాని అమరావతిలో క్వార్టర్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. కరకట్ట రోడ్డు పనులు జరుగుతున్నాయని, సీడ్ యాక్సిస్ రోడ్డులో నాలుగు గ్యాప్‌లను పూర్తి చేసే పనులు మొదలవుతాయని అధికారులు వివరించారు.
ఇవీ చూడండి: